కొర్రీలు పేట్టే కేంద్రాన్ని ఖతం చేద్దాం- సీఎం కేసీఆర్

90
- Advertisement -

వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం పెడుతున్న కొర్రీలు.. ఆడుతున్న డ్రామాలపై తెలంగాణ సర్కార్‌.. టీఆర్‌ ఎస్‌ పార్టీ మరోసారి పోరుబాటకు సిద్ధమైంది. వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవడానికి టీఆర్‌ఎస్‌ పార్టీ ఆందోళనలకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ వివక్షకు నిరసనగా అన్ని స్థాయిల్లో నిరసనలకు కార్యాచరణను సిద్ధం చేసింది. వరి కొనుగోలుపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయడానికి తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగం పక్షాన చేయాల్సిన పోరాటాలు, నిరసనలపై పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఎంపీలు నిరసనలు, ఆందోళన చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేనున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ఏ విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదో బట్టబయలు చేయనున్నారు. మీటింగ్ తర్వాత అదే రోజున ముఖ్యమంత్రి, మంత్రుల బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్లనుంది. ధాన్యం కొనుగోళ్ళ మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్ సభలో, రాజ్యసభలో టిఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడతారు. పంజాబ్ కు చెందిన వరి ధాన్యాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నందున, తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా పంజాబ్ తరహాలో 100 శాతం ఎఫ్ సిఐ సేకరించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు.

- Advertisement -