ఏపీ ప్ర‌భుత్వంపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం..

98

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పందించారు. సోమవారం నాగార్జున సాగర్‌లో పర్యటించిన ఆయన.. హాలియాలో నిర్వహించిన సభలో నీటి వివాదాన్ని ప్రస్తావించారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం, ఏపీ ప్ర‌భుత్వం అవ‌లంభిస్తున్న వైఖ‌రిపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్ర‌భుత్వం అవ‌లంభించే తెలంగాణ వ్య‌తిరేక వైఖ‌రి కావొచ్చు. ఆంధ్రా వాళ్లు చేస్తున్న దాదాగిరీ కావొచ్చు. కృష్ణా న‌దిపై ఏ విధంగా అక్ర‌మ ప్రాజెక్టులు క‌డుతున్నారో ప్ర‌జ‌లంద‌రూ చూస్తున్నారు. కృష్ణా నీళ్లలో రాబోయే రోజుల్లో మ‌న‌కు ఇబ్బంది జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌నం జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. పెద్ద‌దేవుల‌ప‌ల్లి చెరువు వ‌ర‌కు పాలేరు రిజ‌ర్వాయ‌ర్ నుంచి గోదావ‌రి నీళ్ల‌ను తెచ్చి అనుసంధానం చేయాల‌నే స‌ర్వే జ‌రుగుతోంది. అది పూర్త‌యితే నాగార్జున సాగ‌ర్ ఆయ‌క‌ట్టు చాలా సేఫ్ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. పెద్ద‌దేవుల‌ప‌ల్లి – పాలేరు రిజ‌ర్వాయ‌ర్ అనుసంధానం చేసే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

దేవరకొండలో ఐదు లిఫ్టులు, మిర్యాలగూడలో ఐదు లిఫ్టులు, నకిరేకల్‌, హుజూర్‌నగర్‌లో ఒక్కొక్క లిఫ్ట్‌ ఇలా నల్గొండ జిల్లాలో మొత్తం 15 ఎత్తిపోతల పథకాలు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. వీటన్నింటిని ఏడాదిన్నరలోపే పూర్తి చేసి తీరుతామని సభాముఖంగా ఆయన హామీ ఇచ్చారు. జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించాల్సింది పోయి తెలంగాణపై వ్యతిరేక వైఖరిని అవలంభిస్తోందని కేసీఆర్ ఆగ్రహించారు. కేసీఆర్ మాట్లాడుతున్నంత సేపు సభకు వచ్చిన ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు జై కేసీఆర్.. జై టీఆర్ఎస్.. జై తెలంగాణ అంటూ ఈలలు, కేకలతో హోరెత్తించారు.