ఈ నెల 9నుంచి పలు జిల్లాల పర్యటనలకు సీఎం కేసీఆర్ సిద్దమవుతున్నారు. 9వ తేదీన నారాణఖేడ్ 11న సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్, 12న సూర్యాపేట్, 20న వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇదే పర్యటనలో భాగంగా జిల్లాల పర్యటనలో భాగంగా కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో అధికారుల కార్యాలయాల భవన సముదాయాల నిర్మాణానికి ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా శంకుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
గత ఏడాది అక్టోబర్ 11న దసరా సందర్భంగా కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి. తిరిగి అదే రోజు కొత్త జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే స్థలాలు సేకరించి, టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్న జిల్లాల్లో 11న శంకుస్థాపనలు చేయాలని నిర్ణయించారు.
అందులో భాగంగానే ఈ నెల 11న సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్, మిగతా చోట్ల మంత్రులు ఇంటిగ్రేటెడ్ జిల్లా ఆఫీసులకు శంకుస్థాపన చేస్తారు. జనగామలో కడియం శ్రీహరి, వనపర్తిలో మహమూద్ అలీ, గద్వాలలో లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్ లో జూపల్లి కృష్ణారావు, ఆసిఫాబాద్ లో జోగు రామన్న, మంచిర్యాల, పెద్దపల్లిలో నాయిని నర్సింహారెడ్డి, మేడ్చల్ లో శ్రీనివాస యాదవ్, రంగారెడ్డిలో పద్మారావు, వికారాబాద్ లో మహేందర్ రెడ్డి, జగిత్యాలలో ఈటెల రాజెందర్, కామారెడ్డిలో పోచారం శ్రీనివాస రెడ్డి, భూపాలపల్లిలో స్పీకర్ మధుసూదనాచారి శంకుస్థాపన చేస్తారు.
ఈ నెల 12న సూర్యాపేటలో కొత్త జిల్లా కార్యాలయ భవన సముదాయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు ఈ నెల 20న శంకుస్థాపన చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.