వార్ వన్‌సైడ్..సీఎం కేసీఆర్ అభినందనలు

325
kcr trs victory
- Advertisement -

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించింది. మూడుకు మూడు ఎమ్మెల్సీ సీట్లు గెలిచి టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో గెలిచిన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఏకపక్ష‌ విజయాన్ని అందించిన స్థానిక సంస్థల ప్రతినిధులకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషిచేసిన ఆయా జిల్లాల నేతలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు.

నల్గొండ టీఆర్‌ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి 226 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థికి 640 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి 414 ఓట్లు వచ్చాయి. 19 ఓట్లు చెల్లలేదు. దీంతో 226 ఓట్ల మెజార్టీతో చిన్నపరెడ్డి విజయం సాధించారు.

వరంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి 848 ఓట్లు పోలవగా.. కాంగ్రెస్ అభ్యర్థికి 23 ఓట్లు పోలయ్యాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై 825 ఓట్ల ఆధిక్యంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న 806 ఓట్లకు గాను.. 797 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 21 ఓట్లు చెల్లుబాటు కాలేదు. టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డికి 510 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ రెడ్డికి 266 ఓట్లు వచ్చాయి. దీంతో మహేందర్ రెడ్డి 244 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

- Advertisement -