చెడును జయించి మంచిని పంచే పర్వదినానికి ప్రతీక దసరా పండుగ. తెలంగాణలో దసరా అంటేనే ఆనందాల వెల్లువ. పునాస పంటలు ఇంటికి చేరి కొత్త బట్టలతోటి కొలువు దీరి పాలపిట్టను చూసి పరవశించి, జమ్మీ ఆకుతో గుండె గుండెను తాకే అలయ్ బలయ్ అనురాగాల ముచ్చట్లే గడప నిండా.
ఎన్నిపండుగలైనా ఉండనీ, కానీ దసరా పండుగ తరీఖే వేరు.. ఆ ఉత్సాహం.. ఆ ఊపు ఇంకా ఏ పండగ నాడు కనిపించవు. ప్రేమానురాగాల కలబోత. సంబరాల విరిజాత. తెలంగాణ నేలపై అలరారే సంస్కృతీ సాంప్రదాయాల పతాక. ప్రకృతిని దైవంగా భావించే పండుగ. మొత్తంగా మట్టి మనుషుల మధుర జ్ఞాపకాల వేడుక మన దసరా పండుగ.
తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ దసర పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రగతి భవన్‌లో దసరా ఉత్సవాలను అత్యంగా వైభవంగా నిర్వహించారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు చేశారు. వాహన, ఆయుధ పూజను సీఎం కేసీఆర్ స్వయంగా చేశారు. ఈ వేడుకల్లో మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.