“ఎన్టీఆర్” న్యూ లుక్.. అన్న‌గారితో హ‌రికృష్ణ‌..!

252
kalyan ram ntr biopic
- Advertisement -

నందమూరి తారకరామారావు జీవిత కథ నేపథ్యంలో జూగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్‌. ఈ చిత్రంలో పలువురు ప్రముఖులు నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలోని పాత్రల గురించి సందర్భాన్ని బట్టి ఒక్కొక్క లుక్‌ను విడుదల చేస్తూ వచ్చిన మూవీ టీం తాజాగా విజయదశమి పర్వదినం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మరో లుక్‌ను విడుదల చేశారు.

ntr biopic

ఎన్టీఆర్‌ తనయుడు హరికృష్ణ పాత్ర పోషిస్తున్న కళ్యాణ్‌ రామ్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫోటో బాలకృష్ణ కుర్చీలో ఠీవీగా కూర్చుని ఉండగా, కళ్యాణ్‌ రామ్‌ అతనికి చెవిలో ఏదో చెబుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ ఫోటోలో మనకు ఒక క్యాప్షన్‌ కనిపిస్తోంది. విజయం మీది.. విజయ రథ సారధ్యం నాది… నీడలా వెన్నంటే ఉంటా నాన్నగారు అనే లైన్‌ మనకు కనిపిస్తోంది. ఎన్టీఆర్‌ 1983 ఎన్నికలకు ముందు చైతన్య రథంపై రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 75వేల కిలోమీటర్లు ప్రయాణించారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ఎన్టీఆర్‌ ప్రచార రథానికి రథసారధి హరికృష్ణే. అయితే ఆ యాత్ర తర్వాత ఎన్టీఆర్‌ దేశ రాజకీయాల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగా… ఆ రథానికి రథసారధిగా హరికృష్ణ కూడా అంతే పేరు సంపాదించుకున్నారు. తన తండ్రి ప్రయాణిస్తున్న ప్రచార రథానికి అన్ని వేల కిలోమీటర్ల పాటు అలుపెరగకుండా డ్రైవింగ్‌ చేయడం ఒక్క హరికృష్ణకే చెల్లిందనే చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్‌ బయోపిక్‌లో హరికృష్ణ పాత్రను ఆయన తనయుడు కళ్యాణ్‌ రామ్‌ పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు పాత్రలపై క్లారిటి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్‌, హెచ్‌ఎంరెడ్డిగా సత్యనారాయణ, శ్రీదేవిగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. వారి పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను కూడా రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

- Advertisement -