రైతులకు శుభవార్త.. జూన్ 15 నుంచి రైతు బంధు సాయం..

120
kcr
- Advertisement -

రాష్ట్రంలోని రైతన్నలకు తెలంగాణ సర్కారు తీపి కబురు అందించింది. జూన్ 15 నుంచి 25వ తేదీ లోపల రైతు బంధు పంటసాయం కింద ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలని సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. శనివారం వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత యాసంగిలో అవలంబించిన విధానాన్నే ఇప్పుడు కూడా అవలంబిస్తూ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సూచించారు. ఇప్పటిదాకా ఇచ్చిన కేటగిరీల వారిగానే రైతు బంధు సాయాన్ని ఖాతాలో వేయాలన్నారు. కాగా జూన్ 10 వ తేదీని కటాఫ్ డేట్‌గా పెట్టుకోని, ఆ తేదీ వరకూ పార్ట్ బీ నుంచి పార్ట్ ఏలోకి చేరిన భూములకు రైతు బంధు వర్తింప జేయాలని సీఎం ఆదేశించారు.

వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. కల్తీ విత్తనాల మీద ఉక్కుపాదం మోపాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాల వ్యాప్తంగా కల్తీ విత్తన తయారీదారుల మీద దాడులు జరపాలని, కల్తీ విత్తనదారులను వలవేసి పట్టుకోవాలని, ఎంత వారినైనా ఉపేక్షించ వద్దని ఆదేశించారు. వారిపై పీడీ యాక్టు మోపి, అరెస్ట్ చేయాలని సూచించారు. చిత్తశుద్ధితో పనిచేసి కల్తీ విత్తన విక్రయ ముఠాలను పట్టుకున్న పోలీసు అధికారులకు ప్రమోషన్లు, రాయితీలు, సేవా పతకం కూడా అందజేయాలని అధికారులను కోరారు. ఈ మేరకు తక్షణమే పోలీసులను రంగంలోకి దింపాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌తోపాటు వ్యవసాయశాఖ, ఆర్థికశాఖ అధికారులు హాజరయ్యారు.

- Advertisement -