భారీ వ‌ర్షాలు.. అప్ర‌మ‌త్తంగా ఉండండి: సీఎం కేసీఆర్

26
kcr

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం, ప్ర‌జాప్ర‌తినిధులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉదృతి పెరుగుతున్నందున యుద్ద ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను, రెవెన్యూ అధికారులు, ఆర్ అండ్ బీ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇండ్లల్లోంచి బయటకు రావద్దని సీఎం కేసీఆర్ సూచించారు.

గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తమ జిల్లాల్లో, తమ తమ నియోజకవర్గాల్లో వుంటూ ఎప్పటికప్పుడు వరద పరిస్థిని సమీక్షిస్తూ వుండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ ప్రాంతాల అన్నిస్థాయిలలోని టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తెలంగాణ భవన్ కు అందుబాటులో ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తుండాలన్నారు.

ఈ ప్రాంతాల్లోని ప్రజలు కూడా బయటకు వెళ్ల‌కుండా ఇండ్లల్లో వుండడమే క్షేమమని సీఎం పునరుద్ఘాటించారు. రానున్న రెండు రోజులు అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితిల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా వుంటూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.