ఆర్టీసీ నాయకులతో మంత్రులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ చర్చల్లో కార్మికులకు 16 మద్యంతర భృతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. కార్మికులతో చర్చల అనంతరం మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, కేటీఆర్, మహేందర్ రెడ్డి, జగదీష్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు 16 శాతం ఐఆర్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని ప్రకటించారు. ఐఆర్ పెంపుతో ప్రభుత్వంపై నెలకు రూ. 16 కోట్ల భారం పడనుందన్నారు. జులై నుంచి కార్మికులకు ఐఆర్ చెల్లింపు ఉంటుందని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని, ఆర్టీసీ ప్రతిరోజు 93 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేస్తున్నదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర అని మంత్రి ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
RTC బాగు పడితే రాష్ట్ర ప్రజలకు ఎనలేని మేలు జరుగుతుందని సీఎం కేసీఆర్ చెప్పారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు 16శాతం IR ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారన్నారు. ఆర్టీసీలో మార్పుల కోసం ప్రత్యేక కార్యచరణ రెడీ చేశామన్నారు మంత్రి కేటీఆర్.
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ పెంచిన IR జూలై నెల నుంచి వర్తింస్తుందన్నారు. RTC కార్మికులు IRను 25 శాతం అడుగగా.. 16 శాతం ఇస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుందని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. గతంలో కూడా ఆర్టీసీ కార్మికులకు 42శాతం ఫిట్ మెంట్ అడుగగా 43 శాతం అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు మంత్రి మహేందర్ రెడ్డి. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు కార్మికులు సహకరించాలని, ఆర్టీసీ నష్టాల్లో ఉన్న కార్మికుల కోసం IR ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్ దని అన్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో తాము నిర్వహించతలపెట్టిన సమ్మెను ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించారు ఆర్టీసీ సంఘం నేతలు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.