ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ రెండో రోజు ఏరియల్ సర్వే నిర్వహించారు. రామడుగు మండలం లక్ష్మీపూర్ చేరుకున్న సీఎం.. అక్కడ కాళేశ్వరం గ్రావిటీ కాల్వ సొరంగం పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం పనులు జరుగుతున్న తీరు సీఎం ఆరాతీశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అనుబంధంగా నందిమేడారం గ్రామ శివారులో నిర్మిస్తున్న ఆరో ప్యాకేజీ అండర్ టన్నెల్ పంప్ హౌస్ పనులను కేసీఆర్ పరిశీలించారు. టన్నెల్ లో నీటి నిల్వ ఉండే ప్రాంతం సర్జ్ పూల్ ను కూడా పరిశీలించారు. 6, 7 ప్యాకేజీ పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు అధికారులు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు సీఎం.
రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను కేసీఆర్ సందర్శించారు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు పనులను సందర్శించేందుకు వచ్చిన ఆయన గురువారం రాత్రి ఎన్టీపీసీ అతిథిగృహంలో బసచేశారు. తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఎన్టీపీసీ నిర్మిస్తున్న 1600 మెగావాట్ల విద్యుత్‌కేంద్రం నిర్మాణ పనుల పురోగతిపై ఆయన స్వయంగా పరిశీలించారు. రామగుండం ఎన్టీపీసీ ఈడీ దిలీప్‌కుమార్ దూబే ప్రాజెక్టు పనుల వివరాలను సీఎంకు వివరించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.