సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నాశనం కావడానికి కారణం కాంగ్రెస్ నేతలే అని మండిపడ్డారు సీఎం కేసీఆర్. స్వరాష్ట్రంలో తెలంగాణ సగర్వంగా అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ పథకాలను కొనియాడుతుందన్నారు. దేశంలోనే అత్యధిక వడ్డు ఎఫ్‌సీఐకి ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. టీఆర్ఎస్ పాలనలో కోటి 10 లక్షల ఎకరాల వరి పంట సాగు జరిగిందన్నారు. విజయ డెయిరీకి కాంగ్రెస్ ఒక్క పైసా ఇవ్వకుంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ డెయిరీకి వైభవం తెచ్చామని చెప్పారు.
దిండి లిఫ్ట్ ఇరిగేషన్ సస్యశ్యామలం అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. కళ్యాణలక్ష్మీ ఎక్కడైనా ఉందా..?,కంటి వెలుగు ద్వారా 60 లక్షల మందికి వెలుగు ప్రసాదించామన్నారు.కేసీఆర్ కిట్,ధరణితో అవినీతికి చెక్ పెట్టామన్నారు. గ్రామాలను రావణకాష్టాం చేసిన కాంగ్రెస్ నేతలు ఏ ముఖం పెట్టుకుని పొలం బాట కార్యక్రమం చేపట్టారన్నారు. త్వరలో రెండు లక్షల యాదవ కుటుంబాలకు గొర్రెల పంపిణీ చేస్తామన్నారు. మత్య్సకారుల సంక్షేమం కోసం చేప పిల్లల పంపిణీ చేపట్టామన్నారు. కాంగ్రెస్ నేతలు రైతు బంధువులు కాదు రాబందులు అని మండిపడ్డ సీఎం….టీఆర్ఎస్ రైతు బంధు ద్వారా అన్నదాతలను ఆదుకుంటున్నామని చెప్పారు. టీఆర్ఎస్ది అవినీతి లేని క్లీన్ గవర్నమెంట్ అన్నారు. కాంగ్రెస్ నేతలకు రైతు బంధు వస్తుందని చెప్పారు సీఎం.
రైతుల్లో ఐక్యమత్యం రావాల్సి ఉందని…భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 2600 రైతు కేంద్రాలు నిర్మించి ఇచ్చామన్నారు సీఎం కేసీఆర్. రైతులంతా తాము వేసిన పంటల గురించి చర్చించుకోవాలన్నారు. రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడింది టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెల రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. సర్పంచ్‌లంతా బాగా పనిచేస్తున్నారని తెలిపిన సీఎం…అందరం కలిసి పల్లెలను హరిత వనాలుగా మారుద్దామన్నారు.తాను చెప్పే మాటల్లో అబద్దం ఉంటే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించాలని లేదంటే ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు చేయాలన్నారు.