వరద నీటి ప్రభావానికి గురైన హైదరాబాద్ నగరంలోని ప్రతి ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈ ఆర్థిక సాయం మంగళవారం ఉదయం నుంచే ప్రారంభిస్తామని వెల్లడించారు.
పేదలకు సాయం అందించడం కోసం మున్సిపల్ శాఖకు ప్రభుత్వం రూ. 550 కోట్లు తక్షణం విడుదల చేస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. వర్షాలు, వరదల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ. లక్ష చొప్పున, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు కేసీఆర్ తెలిపారు.
దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, మళ్లీ మమూలు జీవన పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.