తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.కేంద్రం ధాన్యం సేకరించే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు.
దేశాన్ని పంటల కాలనీలుగా విభజించండి. ఇది ప్రజాస్వామ్యం.. పోరాడే, అడిగే హక్కులుంటాయి. పంజాబ్, హర్యానా మాదిరిగానే వంద శాతం కొనుగోలు చేయాలి. దేశమంతా ఒకే పాలసీ ఉండాలని కోరుతున్నాం. అట్ల చేయని పక్షంలో అనేక పోరాట రూపాల్లో ఉద్యమం చేస్తాం. అవసరమైతే కేబినెట్ అంతా వెళ్లి తీవ్రమైన నిరసన కార్యక్రమాలు చేపడుతాం. కిసాన్ నాయకులు కూడా తమకు మద్దతు తెలుపుతామన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు రాజ్యాంగ రక్షణ లేదు. రైతులకు రాజ్యాంగ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఆ విధంగానే రేపు పొద్దున కరువు కాటకం వస్తే అన్నం పెట్టే స్థితిలో ఉండాలి. ఏ దేశానికి కూడా ఇండియాకు వారం రోజులు అన్నం పెట్టే స్థితి లేదు. ఈ క్రమంలో ధాన్యం సేకరించి నిల్వ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించాలి. మేం అడిగేది భారత రైతుల కోసమే.. పాకిస్తాన్, అమెరికా రైతుల కోసం కాదని కేసీఆర్ చెప్పారు.