ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ : సీఎం కేసీఆర్‌

143
cm kcr
- Advertisement -

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏండ్లు పూర్తి కాబోతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట, దేశవ్యాప్తంగా జరుపనున్న ఉత్సవాలను, తెలంగాణలో ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నాటి భారత స్వాతంత్ర్య సంగ్రామం జరుగుతున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతం పోషించిన పాత్ర ప్రత్యేకమైనదని సీఎం అన్నారు.

ఉత్సవాల్లో భాగంగా మార్చి 12 న హైదరాబాద్‌ పబ్లిక్ గార్డెన్స్‌లో, వరంగల్‌ పోలీసు గ్రౌండ్స్ లో ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్‌..వరంగల్ లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ పాల్గొంటారు. మార్చి 12న ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీస్ మార్చ్, గాలిలో బెలూన్లు వదలడం తదితర దేశభక్తి కార్యక్రమాలుంటాయని సీఎం వివరించారు. ఈ కార్యక్రమాలను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుపాలని సీఎం సూచించారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా, పండుగ వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇందులో స్వాతంత్ర్య సమరయోధులను అమరవీరులను స్మరించుకుని జోహారులర్పించాలన్నారు. 75 వ స్వాతంత్ర్యోత్సవ ఉత్సవాలకు గుర్తుగా, సంజీవయ్య పార్క్ లో వున్న జాతీయ పతాకం తరహాలో, తెలంగాణ వ్యాప్తంగా 75 ముఖ్యమైన ప్రాంతాల్లో ఘనమైన రీతిలో జాతీయ జెండాలను ఎగురవేయాలని సీఎం తెలిపారు. తద్వారా తెలంగాణ వ్యాప్తంగా జాతీయ భావాలను మరింతగా పెంపొందించాలని పేర్కొన్నారు. 75 వారాల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ స్థాయిల్లో వ్యాస రచన పోటీలు, కవి సమ్మేళనాలు, ఉపన్యాస పోటీలు, చిత్రలేఖన పోటీలు, వంటి దేశభక్తిని పెంచే కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం అన్నారు.

- Advertisement -