ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అధ్యక్షతన శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సు జరిగింది. ఇందులో న్యాయస్థానాల్లో మౌలిక వసతుల కల్పన, న్యాయమూర్తుల ఖాళీలు, సిబ్బంది భర్తీ , న్యాయమూర్తులపై దాడులు, న్యాయ వ్యవస్థలపై దూషణలు సహా పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ సదస్సులో తెలంగాణ హైకోర్టు సీజె సతీష్ చంద్రశర్మ సహా అన్ని హైకోర్టుల సీజెలు పాల్గొన్నారు.
ఈ సదస్సులో సీజేఐ ఎన్వీరమణ మాట్లాడుతూ.. ఆరేళ్ల తర్వాత మరోసారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. కరోనా సమయంలోనూ న్యాయవ్యవస్థ నిబద్దతతో విధులు నిర్వహించింది. సాధ్యమైనంతమేర న్యాయాన్ని అందించేందుకు కృషి చేశాం అన్నారు. కొత్తగా ఫాస్టర్ సిస్టం ప్రవేశపెట్టాం. న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నామని ఎన్వీ రమణ చెప్పారు.
న్యాయ పరిపాలనలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాల్సి ఉంది అన్నారు. కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై దృష్టి సారించాం. ఏడాదిలోపే 126 మంది హైకోర్టు న్యాయమూర్తుల ఖాళీలు భర్తీచేశాం. త్వరలోనే మరో 50 మంది నియామాకాలు పూర్తి చేస్తామన్నారు. సుప్రీంకోర్టులో కొత్తగా 9మంది జడ్జీలను, హైకోర్టులలో 10 మంది సీజెలను నియమించామని తెలిపారు. ఈ రోజు జరిగే చర్చలతో రేపటి సమావేశానికి భూమిక తయారవుతుందని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు.