రాజద్రోహం లేదా దేశద్రోహం సెక్షన్ 124 (ఏ) చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తరువాత కూడా సెక్షన్ 124(ఏ) ఇంకా అవసరమా? అని ప్రశ్నించింది. బ్రిటీషర్లు స్వేచ్ఛను అణిచివేసేందుకు ఉపయోగించిన వలస చట్టం….మహాత్మా గాంధీ, బాల గంగాధర్ తిలక్ వంటి నేతలకు వ్యతిరేకంగా ఉపయోగించిన చట్టం…అలాంటి చట్టం ఇప్పుడు కూడా అవసరమా అని అటార్నీ జనరల్ వేణుగోపాల్ కు సుప్రీంకోర్టు ప్రశ్న వేసింది.
రాజద్రోహం లేదా దేశద్రోహం సెక్షన్ 124 (ఏ) చట్టాన్ని రద్దు చేయాలంటూ మాజీ సైనికాధికారి ఎస్‌జి వొంబట్కేరే దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సెక్షన్ 124 (ఏ)ని దుర్వినియోగ పరచడం, జవాబుదారీ తనం లేకపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రభుత్వం అనేక చట్టాలను రద్దు చేస్తోంది. ఈ చట్టంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదో తెలియడం లేదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. పిటిషన్ ను ప్రేరేపితమైనదిగా పరిగణించలేమన్న సుప్రీంకోర్టు.…దేశం కోసం తన సర్వీసును త్యాగం చేసిన వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడని వ్యాఖ్యానించింది సర్వోన్నత న్యాయస్థానం.ఈ చట్టంపై నమోదైన పెండింగ్ లో ఉన్న అన్ని కేసులను పరిశీలిస్తామని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ. పిటిషన్ పై నోటీసులు జారి చేసింది సుప్రీంకోర్టు.