సీజే రాయ్ ఆత్మహత్య కేసు..హై లెవల్ దర్యాప్తు

7
- Advertisement -

కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ డా. సీజే రాయ్ ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దాడుల సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారన్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసును మరింత లోతుగా విచారించాలన్న డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హై లెవల్ విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు. అవసరమైతే ఈ కేసును అశోక్‌నగర్ పోలీస్ స్టేషన్ నుంచి రాష్ట్ర క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ)కి బదిలీ చేసే అవకాశముందని తెలిపారు. జనవరి 31 సాయంత్రం లేదా ఫిబ్రవరి 1 ఉదయం నాటికి ఈ నిర్ణయం తీసుకునే వీలుందని వర్గాలు చెబుతున్నాయి.

ఈ ఘటనపై స్పందించిన డీకే శివకుమార్, “ఐటీ అధికారులు ప్రశ్నలు అడుగుతున్న సమయంలో ఆయన ఐదు నిమిషాలు కావాలని చెప్పి లోపలికి వెళ్లి తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇది జరగకూడదు. ఆయన మంచి వ్యాపారవేత్త. నిజం బయటకు రావడానికి హై లెవల్ ప్రోబ్ చేస్తాం. కేరళ నుంచి కూడా ఒక బృందం వచ్చింది. పూర్తి విచారణ అనంతరం ప్రజలకు నిజాలు వెల్లడిస్తాం. ఢిల్లీ నుంచి కూడా నివేదిక కోరారు” అని చెప్పారు.

సీజే రాయ్ సోదరుడు సీజే బాబు మీడియాతో మాట్లాడుతూ, ఆదాయపు పన్ను విచారణ తప్ప మరే ఇతర సమస్యలు తన సోదరుడికి లేవని స్పష్టం చేశారు. “ఐటీ అంశం తప్ప బెదిరింపులు, అప్పులు లేదా ఇతర ఇబ్బందులు ఏవీ లేవు. దీనిపై నాకు పూర్తి నమ్మకం ఉంది” అన్నారు. శుక్రవారం ఉదయం 10:40 గంటలకు రాయ్‌తో చివరిసారి మాట్లాడినట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం కార్యాలయ సిబ్బందితో మాట్లాడతానన్నారు. ప్రస్తుతం కుటుంబం అంత్యక్రియల ఏర్పాట్లపై దృష్టి పెట్టింది.

ఇదివరకే సీజే రాయ్ భార్య లినా, కుమారుడు రోహిత్ బెంగళూరులోని బౌరింగ్ హాస్పిటల్ మోర్టువరీకి చేరుకున్నారు. కర్ణాటక ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ నలపాద్ కూడా అక్కడికి వచ్చారు. పోలీసులు డా. సీజే రాయ్‌కు సంబంధించిన ఒక డైరీని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అందులో ప్రధానంగా సినీ ప్రముఖుల ఫోన్ నంబర్లు మాత్రమే ఉన్నాయని, దర్యాప్తు కోణంలో విశ్లేషిస్తున్నామని వర్గాలు తెలిపాయి. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను కూడా పోలీసులు నమోదు చేస్తున్నారు.

గత శుక్రవారం సుమారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో, కర్ణాటక–కేరళ ఐటీ బృందాలు 2–3 రోజులుగా నిర్వహిస్తున్న దాడుల మధ్యలో రాయ్ తన కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, సంఘటనా స్థలానికి ఎఫ్‌ఎస్‌ఎల్, సోకో బృందాలు చేరుకుని విచారణ చేస్తున్నాయని తెలిపారు. ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ, ఫోరెన్సిక్ నివేదికల తర్వాత పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.

Also Read:మహా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్!

- Advertisement -