సినిమా టికెట్‌ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతి..

42
Cinema ticket rates

ఏపీలో సినిమా టికెట్‌ ధరల వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధర పెంపునకు అనుమతిని ఇచ్చింది. నిర్మాతల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రేట్ల పెంపుపై సర్కార్‌కు అధికారుల కమిటీ సిఫారసుల ప్రతిపాదనల మేరకు రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

మల్టీప్లెక్స్ లలో కనీస ధర రూ. 100, గరిష్ఠ ధర రూ. 250కి పెంచింది. మల్టీప్లెక్స్ రిక్లైనర్ సీట్ల ధరను గరిష్ఠంగా రూ. 300కు పెంచుకోవడానికి అనుమతించింది. ఇక ఏసీ థియేటర్లలో కనీస ధర రూ. 50, గరిష్ఠ ధర రూ. 150గా నిర్ణయించింది. టికెట్ ధరలకు జీఎస్టీ, నిర్వహణ ఛార్జీలు అదనం. నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్లు రూ. 5, నాన్ ఏసీ థియేటర్లు రూ. 3 వసూలు చేసుకోవచ్చు. ఆన్ లైన్ టికెటింగ్ సంస్థలు కన్వీనియన్స్ రుసుం, జీఎస్టీ వసూలు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై టాలీవుడ్‌ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.