తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్‌లో సినీ గ్లామర్ కొత్తకాదు. టీడీపీని స్ధాపించిన కొద్దికాలంలోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ తర్వాత ఎంతోమంది సినీ ప్రముఖులను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. నాటి నుండి నేటివరకు ఎంతోమంది సినీప్రముఖులు వివిధ పార్టీల నుండి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఏపీతో పోలీస్తే తెలంగాణ రాజకీయాల్లో సినీగ్లామర్ కాస్త తక్కువే .
ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూలేని విధంగా సినిమా నటులు ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ దగ్గరి నుండి టీడీపీ,వైసీపీలో సినీ పాలిట్రిక్స్ ఈసారి ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపించబోతున్నాయి. ఇప్పటివరకు బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టిన నటులు ఓట్ల బ్యాంక్‌ను కొల్లగొట్టేందుకు రెడీ అయ్యారు. యాక్షన్‌కు ప్యాకప్ చెప్పి రాజకీయ రంగ స్దలంలోకి దిగుతున్నారు.
సినిమాలకు గుడ్‌బై చెప్పి జనసేన పార్టీని స్థాపించి రంగంలోకి దిగారు పవన్. తానే స్టార్ క్యాంపయినర్‌గా మారి ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. జబర్దస్త్ ఫేమ్ ఆది జనసేన తరఫున ప్రచారంలో పాల్గొంటుండగా షకలక శంకర్ తదితరులు బహిరంగంగా మద్దతు తెలుపుతున్నారు.
నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి బరిలోకి దిగుతున్నారు. రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నా ఆయన తెర వెనుక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాతలు వల్లభనేని వంశీ, మాగంటి బాబు ఎన్నికల బరిలో ఉన్నారు. బీజేపీకి కృష్ణంరాజు వంటి స్టార్ నటులు ఉన్నా ఆయన పోటీకి దూరంగా ఉంటున్నారు. అయితే నటి మాధవిలత మాత్రం గుంటూరు నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
ఇక ఈసారి వైసీపీ నుండి పెద్ద ఎత్తున సినీనటులు ప్రచారం నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. చిత్తూరు జిల్లా నగరి నుంచి సినీ నటి రోజా మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. హాస్య నటుడు పృథ్వీరాజ్, రచయిత పోసాని కృష్ణమురళి తమ గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. రీసెంట్‌గా సీనియర్ నటి జయసుధ, హాస్యనటుడు అలీ, రాజా రవీంద్ర, దాసరి అరుణ్, భానుచందర్, కృష్ణుడు వైసీపీ కండువా కప్పుకోగా సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ విజయవాడ బరిలో దిగారు. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా మారిన సినీ గ్లామర్ ఏ పార్టీకి కలిసోస్తుందో వేచిచూడాలి.