శతమానం భవతి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఖైదీ నెంబర్ 150, గౌతమి పుత్ర శాతకర్ణితో పాటు సంక్రాంతి బరిలో నిలిచిన శతమానం భవతి టాలీవుడ్‌లో ఘనవిజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సిస్‌లోనూ సత్తాచాటింది. అన్ని వర్గాల ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించ్చింది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌కు మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వివి వినాయక్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి శతమానం భవతి విజయం తన ఇంట్లో వ్యక్తికి దక్కిన విజయంగా భావిస్తానని అన్నారు. తన చిత్రంతో పోటికి వచ్చిన ఈ చిత్ర బృందానికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేశారు.
శర్వానంద్‌ను చిన్నప్పట్నుంచి చూస్తున్నానని చరణ్‌కు మంచి స్నేహితుడని తెలిపాడు. మా ఇంట్లోనే తిరుగుతూ పెరిగాడు. చాలా సౌమ్యంగా కనిపించే శర్వా హీరో అవుతాడని అనుకోలేదు. కానీ, శర్వాకు సినిమాలంటే చాలా ఆసక్తని చరణ్ చెప్పడంతో ఆశ్చర్యపోయా. మొదటిసారి ఓ వాణిజ్య ప్రకటనలో నాతో కలిసి నటించాడు. ఆ తర్వాత శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో నటించాడు. అతను వరుసగా విజయాలు సాధిస్తుండడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు.
దిల్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఇలాంటి మంచి సినిమా నిర్మించినందుకు అతణ్ని అభినందిస్తున్నా. ఎస్వీ రంగారావు తర్వాత ఆ స్థాయిలో అన్ని పాత్రల్లోనూ ఒదిగిపోయే నటుడు ప్రకాశ్‌రాజ్. జయసుధ కూడా అద్భుతంగా నటించారని చిరంజీవి అన్నాడు. ఇదే వేదికపై దర్శకుడు వినాయక్‌ను నిర్మాత దిల్ రాజు ఘనంగా సన్మానించాడు.