విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటించిన మూవీ ‘హలో’. ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానుండగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక ఎన్‌కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగా స్టార్ చిరంజీవి,రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అక్కినేని కుటుంబంతో నాకెంతో అవినాభావ సంబంధం ఉందని చిరంజీవి అన్నారు. ముందుగా ‘హలో’ టైటిల్ ఈ సినిమాకి పెట్టినందుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ సినిమాకి ప్రచారం అవసరం లేదన్నారు. అక్కినేని నాగేశ్వరరావు ‘హలో హలో…’ అంటూ పాడారు. నాగార్జున, అమల ‘హలో గురూ…’ అని పాడుకొన్నారు. ‘హలోబ్రదర్’ అనే సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు అఖిల్ కూడా ‘హలో’ అంటూ పలకరిస్తున్నాడు. చరిత్రలో నిలిచిపోయేలా ‘మనం’ చిత్రాన్ని తీసిన విక్రమ్, అదే స్థాయిలో ‘హలో’ ప్రేమకథని తెరకెక్కించాడు. అఖిల్ ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కుతాడు’’ అన్నారు చిరంజీవి.
హలో ఐడియా ఎవరిదో కానీ నిజంగా హ్యాట్సాఫ్.. ఈ రోజుల్లో హలో అనేపదం అందరి నోళ్ళలో నాని పోతోంది. అలాంటి ఈ టైటిల్ ఐడియా అనేది నిజంగా గ్రేట్.. అన్నారు. ఒక అద్భుతమైన ప్రేమకథ. ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. ఇలాంటి ఓ సినిమా తీసినందుకు విక్రమ్‌కి అభినందనలు చెబుతున్నా. యువతరాన్నే అలరించే అంశాలే కాకుండా, అద్భుతమైన సెంటిమెంట్ కూడా ఉంది అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ చిరంజీవి ఇంటికెళ్లి మీరు అఖిల్‌ని ఆశీర్వదించాలనగానే ‘ఎప్పుడైనా, ఎక్కడికి రావాలో చెప్పండి’ అన్నారు. సినిమా చూశాకే వేడుకకి రండి అని చెప్పా. చిరంజీవి ఆశీర్వాదాలు ఎప్పుడూ మాకున్నాయి. వయసులో అంతరం ఉన్నా నాకూ చిరంజీవికీ మధ్య మంచి స్నేహం కుదిరింది. అలా రామ్‌చరణ్‌కీ, అఖిల్‌కీ మధ్య కూడా మంచి స్నేహం ఉంది. అన్నయ్య, తమ్ముడు అని ఆ ఇద్దరూ పిలుచుకొంటుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమా ఎంత ఆడుతుందనేది ఏమీ చెప్పలేను. అఖిల్ పాడటం, ఆడటం చూస్తుంటే కడుపు నిండుతోంది. కథానాయిక కల్యాణికి మంచి భవిష్యత్తు ఉంది. విక్రమ్ కె.కుమార్‌తో మా కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ‘మనం’ తర్వాత మరో మంచి చిత్రాన్ని అందించారన్నారు.