‘రౌడీ అల్లుడు’..బాక్సులు బద్దలైపోతాయి

72
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌కులుగా, డా.కె.వెంక‌టేశ్వ‌ర‌రావు నిర్మించిన `రౌడీ అల్లుడు` ఓ సెన్సేష‌న్‌. బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్ కొట్టిన చిత్ర‌మిది. శోభన, దివ్య భారతి క‌థానాయికలుగా న‌టించారు. గ్యాంగ్ లీడ‌ర్ త‌ర్వాత ఆ రేంజులో బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన చిత్ర‌మిది. ఈ సినిమా 18 అక్టోబ‌ర్ 1991లో రిలీజైంది. ఇన్నేళ్లుగా ఈ చిత్రం ఇప్ప‌టికీ అభిమానుల గుండెల్లో మ‌ర‌పురాని చిత్రంగా నిలిచిపోయిందంటే అందుకు కార‌ణాలెన్నో.ఇవాళ చిరు బర్త్ డే సందర్భంగా రౌడీ అల్లుడు సినిమా గురించి తెలుసుకుందాం..

కొండవీటి దొంగ , జగదేకవీరుడు అతిలోకసుందరి , కొదమసింహం, రాజా విక్రమార్క, స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్, గ్యాంగ్ లీడర్ .. ఇవ‌న్నీ ఓ రాబిన్ హుడ్, ఓ పోలీస్ ఆఫీసర్, ఒక కౌబాయ్ తరహా కథలతో తెర‌కెక్కిన చిత్రాలు. వాట‌న్నిటికీ భిన్నంగా మెగాస్టార్ చిరంజీవి న‌టించిన పూర్తి స్థాయి కామెడీ యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్‌ ‘రౌడీ అల్లుడు’.

ఒకే పోలిక‌తో ఏడుగురు ఉంటారంటారు. ఈ సినిమాలో ఒకే పోలిక‌తో ఉన్న ఇద్ద‌రు ఆడిన నాట‌కం ఏంట‌న్న‌ది ఆస‌క్తిక‌రం. కోట్లాది రూపాయ‌ల ఆస్తికి వార‌సుడు అయిన ఓ బిజినెస్ మ్యాగ్నెట్ (క‌ల్యాణ్‌)ని మోసం చేసి ఆస్తి కొట్టేయాల‌ని అదే పోలిక‌తో ఉన్న ఆటో జానీని తెచ్చి కుట్ర చేస్తే అస‌లు నిజం తెలుసుకున్న ఆటోజానీ ఆ దుర్మార్గుల పాలిట య‌మ‌కింక‌రుడిగా ఎలా మారాడ‌న్న‌దే – రౌడీ అల్లుడు క‌థాంశం. మోస‌గాళ్ల‌కు మోస‌గాడిగా జానీ వేసిన స్కెచ్ ఏంట‌న్నది ర‌క్తి క‌ట్టించేలా తెర‌కెక్కించారు కె.రాఘ‌వేంద్ర‌రావు. మెగాస్టార్ ద్విపాత్రాభిన‌యం ఆల్ టైమ్ ట్రెండ్ సెట్టింగ్ పెర్ఫామెన్స్ తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నంలోకి దించేసిందంటే అతిశ‌యోక్తి కాదు.

చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన పది సినిమాల్లో రౌడీ అల్లుడు ఒక‌టి. మిగిలిన తొమ్మిదింటిలో చిరంజీవి నటన ఒక ఎత్తు అయితే ఇందులో చిరంజీవి నటన మరో ఎత్తు. విద్యావంతుడు, పెద్దింటి కుటుంబానికి చెందిన వ్యాపారవేత్త పాత్రలో కల్యాణ్ హుందాగా క‌నిపిస్తే, ‘ఇదర్ కా మాల్ ఉదర్, ఉదర్ కా మాల్ ఇదర్’ చేరుస్తూ చిన్నచిన్న మోసాలు చేస్తూ, ఆటో నడుపుకుంటూ తన జీవనాన్ని సాగించే ఆటో జానీ పాత్రలో చిరు జీవించారు. రెండు పాత్రల్లోని భిన్న పార్స్యాలను తన ఆంగికం, వాచికంతో అద‌ర‌హో అన్న రీతిలో మెప్పించారు.

Also Read:ఉపేంద్ర గాడి అడ్డా..ప్రారంభం

“వీడెవడండీ బాబూ ..” అంటూ కోట,`బొంబైలో అంతే, బొంబైలో అంత` అంటూ అల్లు నవ్వులతో ముంచెత్తుతూ భయంకరమైన విలనీతో అద్బుత‌మైన పెర్ఫామెన్స్ చేశారు. `భగవంతుడు అంతే బాబు అప్పుడప్పుడూ `కమాల్` చేస్తూ ఉంటాడు` అంటూ వచ్చి రాని హిందీలో అల్లు మాట్లాడటం. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లకింగ్స్ , నో టచింగ్స్ , సిట్టింగ్స్ , స్టాన్డింగ్స్ అంటూ వచ్చీ రాని ఇంగ్లీష్ లో జానీ సంభాషణలు సినిమాకు బలమైన బలం !! ‘బాక్సులు బద్దలైపోతాయి’ అనే డైలాగ్ స్టేట్ మొత్తాన్ని ఒక ఊపు ఊపింది.

మెగాస్టార్ ‘స్టేట్ రౌడీ’, ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాలకు సంగీతం అందించిన బప్పీలహరి ఈ సినిమాకు కూడా చ‌క్క‌ని సంగీతం అందించారు. ‘చిలుకా క్షేమమా’ అంటూ మొదటి పాటగా వచ్చే డ్యూయెట్ సూపర్ హిట్ సాంగ్, జానీ పాత్ర ఇంట్రో కాగానే డిస్కోశాంతితో వచ్చే ‘అమలాపురం బుల్లోడా .. నీ బొంబై చూడాలా’ అనే సాంగ్ మాస్ పాటల్లో నేటికీ, ఎప్పటికైనా గుర్తుండిపోయే పాట. ఆ పాటలో చిరంజీవి డ్యాన్సులోని స్పీడుని ఈ తరం నటులు ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని కూడా చేయలేరు. ‘కోరి కోరి కాలుతోంది’ అంటూ సాగే తొలిరాత్రి పాట రొమాంటిక్ గా ఉంటుంది. ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు, లవ్లీ మై హీరో, తద్దినక తప్పదిక పాటల్లో చిరంజీవి, దివ్యభారతి డ్యాన్సులు కొత్తగా ఉంటాయి. ‘లవ్లీ మై హీరో ..’ పాట మధ్యలో వచ్చే ఒక సుదీర్ఘమైన మ్యూజిక్ బిట్ కి చిరంజీవి దివ్యభారతి చేసే డ్యాన్సు ప్రత్యేకంగా ఉంటుంది.మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన `రౌడీ అల్లుడు` చిత్రానికి డా.కె.వెంక‌టేశ్వ‌ర‌రావు నిర్మాత‌. చిరంజీవితో `న్యాయం కోసం`, `చ‌క్ర‌వ‌ర్తి` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల్ని నిర్మించిన త‌ర్వాత హ్యాట్రిక్ చిత్రంగా `రౌడీ అల్లుడు` చిత్రాన్ని నిర్మించారు.

Also Read:CM KCR:కేబినెట్ విస్తరణ

- Advertisement -