చైనాకు చెందిన స్పై బర్డ్ వ్యవహారం కర్ణాటకలో కలకలం రేపుతోంది. ఉత్తర కన్నడ జిల్లా కార్వార్‌లోని ఠాగూర్ బీచ్ ప్రాంతంలో కదలలేని స్థితిలో ఉన్న ఓ సీగల్ పక్షిని స్థానికులు గుర్తించారు. అనుమానాస్పదంగా కనిపించిన ఈ పక్షిని చూసిన వారు వెంటనే కోస్టల్ పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో స్పందించిన కోస్టల్ పోలీసులు అక్కడికి చేరుకుని పక్షిని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.
పోలీసులు పరిశీలించగా, ఆ సీగల్ పక్షి పైభాగంలో సోలార్ ప్యానెల్‌తో కూడిన GPS ట్రాకర్ అమర్చినట్లు గుర్తించారు. ఇది సాధారణంగా పరిశోధన లేదా ట్రాకింగ్ కోసం ఉపయోగించే పరికరం అయినప్పటికీ, భద్రతా పరంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ GPS ట్రాకర్‌లో “ఈ పక్షి ఎవరికైనా దొరికితే మాకు మెయిల్ చేయండి” అంటూ చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్కు సంబంధించిన సందేశం ఉండటంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
ఈ ఘటన నేపథ్యంలో ఉత్తర కన్నడ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. శాస్త్రీయ పరిశోధనలో భాగమేనా? లేక గూఢచర్యానికి సంబంధించిన అంశమా? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అవసరమైతే కేంద్ర భద్రతా సంస్థల సహకారం కూడా తీసుకుంటామని వెల్లడించారు.
Also Read:ఛాంపియన్ మూవీ..ఆనందంగా ఉంది!

