బీజేపీ ఆఫీస్‌లో చైనా కమ్యూనిస్టు బృందం!

9
- Advertisement -

2020లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత తొలిసారిగా చైనా కమ్యూనిస్టు పార్టీ (CPC) ప్రతినిధి బృందం న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ విభాగం (IDCPC) ఉప మంత్రి సున్ హైయాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ విషయాన్ని బీజేపీ విదేశాంగ వ్యవహారాల విభాగం ఇన్‌చార్జ్ విజయ్ చౌతైవాలే X (ట్విట్టర్)లో వెల్లడించారు.

ఈ సమావేశంలో బీజేపీ–సీపీసీ మధ్య పార్టీ స్థాయి కమ్యూనికేషన్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, పరస్పర సంభాషణలు, పరస్పర చర్యలను ఎలా బలోపేతం చేయాలి అనే అంశాలపై చర్చించినట్లు చౌతైవాలే తెలిపారు. బీజేపీ తరఫున ఈ భేటీలో పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ నేతృత్వం వహించారు. అలాగే భారతదేశంలోని చైనా రాయబారి షూ ఫెయ్‌హాంగ్ కూడా సీపీసీ ప్రతినిధి బృందంతో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

చైనా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ విభాగం ఉప మంత్రి సున్ హైయాన్ ఈరోజు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ, సీపీసీ మధ్య కమ్యూనికేషన్, పరస్పర చర్యలను ఎలా మెరుగుపరచాలనే అంశాలపై చర్చించాం అని అరుణ్ సింగ్ ట్వీట్ చేశారు. చారిత్రకంగా చూస్తే, 2000ల చివరి నుంచే బీజేపీ, సీపీసీ మధ్య పరిమిత స్థాయి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఆ సమయంలో బీజేపీ ప్రతినిధి బృందాలు బీజింగ్‌కు వెళ్లి చైనా ఉన్నత నేతలతో సమావేశాలు నిర్వహించాయి. అయితే, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వద్ద 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణ తర్వాత ఇదే తొలి పార్టీ–పార్టీ భేటీ కావడం విశేషం.

ఈ సమావేశం, ప్రధాని నరేంద్ర మోదీ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య ఐదేళ్ల తర్వాత తొలి ద్వైపాక్షిక భేటీ జరిగిన నేపథ్యంలో వచ్చింది. 2024 అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఈ భేటీ జరిగింది. దాని తర్వాత తూర్పు లడఖ్ ప్రాంతంలో డిసెంగేజ్‌మెంట్ చర్చలకు, దౌత్య సంభాషణల పునఃప్రారంభానికి మార్గం సుగమమైంది.

Also Read:పండగవేళ..మందుబాబులకు షాక్‌!

- Advertisement -