గురువారం సాయంత్రం హైదరాబాద్ రవీంద్ర భారతిలో భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో సినీ నటుడు, రచయిత ఉత్తేజ్ కుమార్తె చేతన ఉత్తేజ్ `అష్టవిధనాయిక` అనే కాన్సెప్ట్ ను ప్రయోగాత్మకంగా ప్రదర్శించింది. ఆద్యంతం నయనమనోహరంగా అద్భుతంగా ప్రదర్శించారు. భరతముని నాట్య శాస్త్రంలోని ఎనిమిది రకాల నాయికల మనస్తత్వాలను గొప్పగా అభినయించారు. లైటింగ్, సౌండ్ ఆకట్టుకున్నాయి. అలాగే ప్రస్తుతం సమాజంలో స్ర్తీ ఎదుర్కోంటున్న దాడులను, అత్యాచారాలను కథా వస్తువుగా చేసుకుని ఉత్తేజ్ రచించిన `అనంత`ని కూడా చేతన ఉత్తేజ్ సోలోగా ప్రదర్శించి సభికుల ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా…
ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ రాష్ర్ట సలహాదారులు కె. వి. రమణాచారి మాట్లాడుతూ, ` సాత్విక అభినయం ప్రధానంగా డైలాగ్ లు లేకుండా ప్రదర్శించడం గొప్ప విషయం` అన్నారు.
తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ, `కన్నుల పండువగా, హృదయరంజకంగా ప్రదర్శించిన తీరును మెచ్చుకున్నారు. చేతన భవిష్యత్‌లో ఎలాంటి ప్రదర్శన చేసినా ప్రభుత్వ సహకారం ఉంటుంద`న్నారు.
నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ, `ఎన్నో ఏళ్ల తర్వాత ఇలాంటి ప్రదర్శన చూశాను. గుండె నిండుగా అయింది. కళ్లు చెమర్చాయి. నోట మాటలు రాలేద`న్నారు.
దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ, `వర్షం పడుతుంది. పైగా వెబ్ సిరీస్ పనుల్లో బిజీగా ఉన్నాను. కానీ ఉత్తేజ్ మీద అభిమానంతో వచ్చాను. ప్రదర్శన చూశాక రాకపోయి ఉంటే ఎంతో మిస్ అయ్యేదాన్ని. చేతన `రంగస్థలం` వదలకూడదు. విశ్వ వ్యాప్తంగా ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వాలి` అని అన్నారు.
నటి ఝాన్సీ మాట్లాడుతూ, `చేతన అభినయం ఎంతో బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దీని వెనుక ఎంతో కష్టం ఉంది, మాటని ఉపయోగించకుండా నాట్య రూపాన్ని.. మాటలని ఉపయోగిస్తూ ‘అనంత’ ని అద్భుతంగా చేసింది` అని అన్నారు.
అభినయ అధ్యాపకులు దీక్షిత్ మాట్లాడుతూ, ` ఇది నా ఇంటి బిడ్డ ప్రోగ్రాం. `రంగస్థలం`పై ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం ఆనందంగా ఉంది. ఒగ్గు కథ, శారద కథ , సాంప్రదాయ కళా రూపాలను కలిపి ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం చాలా గొప్పగా ఉంది. సినిమాలు చేస్తోన్న, ఇతర మాధ్యమాల్లో ఉన్నా అమ్మ ఒడి వంటి రంగస్థలాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు` అని అన్నారు. వర్షం పడుతున్న కూడా ప్రేక్షకులు రవీంద్రభారతికి విచ్చేసి కార్యక్రమాన్ని ఆద్యంతం చూసి వేనోళ్ళ పొగిడారు.