ఐపీఎల్ 11లో భాగంగా చెన్నై గ్రాండ్ విక్టరీ సాధించింది. ధోని ధనా ధన్ పర్ఫామెన్స్‌తో చెన్నైకి మరోసారి విజయాన్ని అందించాడు. బెంగళూరు విధించిన 208 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే చేధించింది. ధోని,రాయుడు రాణించడంతో కొండంత లక్ష్యాన్ని పిండిచేసింది. ధోని (70 నాటౌట్; 34 బంతుల్లో 1×4, 7×6), రాయుడు (82; 53 బంతుల్లో 3×4, 8×6) విరుచుకుపడడంతో భారీ లక్ష్యాన్ని చెన్నై 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ధోనీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
చివరి రెండు ఓవర్లలో విజయానికి 30 పరుగులు కావాల్సి ఉండగా ధోని, బ్రావో ఎలాంటి తడబాటు లేకుండా చెన్నైకి విజయాన్నందించారు. 19వ ఓవర్లో 14 పరుగులు రాబట్టిన చెన్నై…. చివరి ఓవర్లో అండర్సన్ బౌలింగ్‌లో వరుసగా 4, 6 బాదిన బ్రావో.. సింగిల్ తీసి ధోనీకి బ్యాటింగ్‌కు ఇచ్చాడు. ధోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిక్స్‌తో పని పూర్తిచేశాడు.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఆరంభం కలిసిరాలేదు. తొలి 5 ఓవర్లకు ఓ వికెట్ కోల్పోయి 35 పరుగులు చేసింది. తర్వాత వచ్చిన ఏబీ డివిలియర్స్ చెన్నై బౌలర్లను ఉచకోత కోశాడు. ఏబీ 23 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. ఏబీ డివిలియర్స్ (68; 30 బంతుల్లో 2×4, 8×6), డికాక్ (53; 37 బంతుల్లో 1×4, 4×6),మన్‌దీప్ సింగ్ (32; 17 బంతుల్లో 1×4, 3×6) మెరవడంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 207 పరుగులు చేసింది.