ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల ప్రభావంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం ఇతర దేశాలపై కూడా పడుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లలో మార్పులు వస్తే రైతులు, వ్యాపారాలు కూడా ప్రభావితమవుతాయని తెలిపారు.
ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితి నెలకొన్నదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల వల్ల అరటి పండ్లు, గుడ్ల ధరలు భారీగా పడిపోయాయని చెప్పారు. యుద్ధాలు, అంతర్జాతీయ సంక్షోభాలు జరిగే సమయంలో కేవలం ప్రేక్షకులుగా ఉండిపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇలాంటి పరిస్థితులను ముందుగానే అంచనా వేసి రైతులకు, వ్యాపారాలకు ప్రత్యామ్నాయ మార్కెట్లు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. సంక్షోభ సమయంలో కూడా వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధరలు లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధికి టెక్నాలజీ కీలకమని పేర్కొన్న సీఎం చంద్రబాబు, వచ్చే 18 నెలల్లో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. డిజిటల్ కనెక్టివిటీ పెరగడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
Also Read:వార్ ఎఫెక్ట్..యూరియాపై కూడా!

