దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రాబోతుందా..? 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రాంతీయ పార్టీలు ఫ్రంట్ దిశగా అడుగులేస్తున్నాయా? అంటే అవుననే అనిపిస్తున్నాయి తాజా పరిణామాలు. ఇందుకు కర్నాటక సీఎం కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం వేదిక కాబోతోంది. కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు బెంగళూరు వెళ్లిన చంద్రబాబు.. అక్కడకు వచ్చిన మమతా బెనర్జీ, మాయావతి,కేజ్రీవాల్‌తో వేర్వేరుగా చర్చలు జరిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం బీజేపీకి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో కలిసిరావాలని కోరారు.
ప్రాంతీయ పార్టీల బలోపేతంపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలనే అంశం నేతల భేటీల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.ఏపీలో పరిణామాలు, బీజేపీ చేస్తోన్న రాజకీయాలను వారికి వివరించినట్లు సమాచారం. దేశాభివృద్ధి కోసం ప్రాంతీయ పార్టీలన్ని కలిసి పని చేయాలని నేతలందరూ అభిప్రాయానికి వచ్చారు.
మమతా బెనర్జీతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలు బలోపేతమైనప్పుడే దేశం బాగుంటుందని బెంగాల్ సిఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. కుమారస్వామికి మద్దతు ఇచ్చేందుకే తామె బెంగళూరు వచ్చినట్టు ఆమె వెల్లడించారు. ప్రాంతీయ పార్టీ అయిన జెడిఎస్‌కు తాము అండగా ఉంటామని ఆమె చెప్పారు. దేశాభివృద్ధి కోసం సమష్టిగా పని చేస్తామని ఆమె స్పష్టం చేశారు. దేశ భవిష్యత్, జాతీయ ప్రయోజనాల కోసం ధైర్యంగా ముందుకు సాగుతామని ఆమె చెప్పారు.
దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలని సీఎం కేసీఆర్ ప్రతిపాదన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కేసీఆర్ తెచ్చిన ప్రతిపాదనకు మమతాతో పాటు స్టాలిన్,శిబు సోరెన్,కుమారస్వామి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.