ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్–2025’ అవార్డుతో సీఎం చంద్రబాబును ఎకనామిక్ టైమ్స్ సత్కరించినట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ విషయంతో ఉదయం నుంచి కొనసాగిన సస్పెన్స్‌కు లోకేశ్ తెరదించారు.
ఈ రోజు ఉదయం నారా లోకేశ్ “మధ్యాహ్నం 12 గంటలకు భారీ ప్రకటన” అంటూ ట్వీట్ చేయడంతో రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం ఆయన మరో ట్వీట్ ద్వారా అసలు విషయాన్ని వెల్లడించారు. ఎకనామిక్ టైమ్స్ వేదికగా ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్–2025’ అవార్డుతో సీఎం చంద్రబాబును గౌరవించారని స్పష్టం చేశారు.
వ్యాపార అనుకూల విధానాలు, పెట్టుబడులను ఆకర్షించే సంస్కరణలు, పారిశ్రామిక అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలకుగాను చంద్రబాబుకు ఈ అవార్డు దక్కిందని లోకేశ్ పేర్కొన్నారు. ఇది కేవలం తమ కుటుంబానికి మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమని ఆయన పోస్ట్‌లో తెలిపారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనుకూల గమ్యస్థానంగా తీర్చిదిద్దడంలో సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు.
చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ఆర్థికంగా బలోపేతం దిశగా ముందుకెళ్తోందని, ఈ అవార్డు రాష్ట్ర ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో మరింత పెంచుతుందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Also Read:ఛాంపియన్ మూవీ..ఆనందంగా ఉంది!

