రాజకీయ చదరంగంలో స్వబలంతో పాటు ప్రత్యర్థులను దెబ్బ తీసే చతురత కూడా చాలా ముఖ్యం. సరైన ఎత్తుగడలు వేసి ప్రత్యర్థులను చిత్తు చేసేలా వ్యూహాలు రచించినప్పుడే పార్టీ బలం పెంచుకునే వీలుంటుంది. అందుకే రాజకీయ నేతలు తమ పార్టీని బలపరిచేందుకు వ్యూహకర్తలను నియమించుకుంటూ ఉంటారు. వారి వ్యూహాల అనుసారంగా పార్టీ కార్యాచరణను రూపొంచుకుంటూ ఉంటారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎక్కువే అనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఈసారి టీడీపీ కూడా వ్యూహకర్త విషయంలో గట్టిగానే ఫోకస్ చేస్తూ వచ్చింది. ప్రస్తుతం టీడీపీకి రాబిన్ శర్మ వ్యూహ కర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన వ్యూహాలు టీడీపీకి మంచి మైలేజ్ తెచ్చిపెడుతున్నాయి.
సైకో పోవాలి సైకిల్ రావాలి, ఇదేం ఖర్మ రాష్ట్రానికి, బాబుతో అభివృద్ధి సాధ్యం… ఇలా ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు చేరువ కావడంతో రాబిన్ శర్మ వ్యూహాలే ప్రధాన పాత్ర పోషించాయి. అయితే ఏపీలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా.. ఇంకా పకడ్బందీ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలో వైసీపీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్ ను చంద్రబాబు రంగంలోకి దించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల తర్వాత వైసీపీకి దూరంగా ఉంటున్నారు పికే. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన చతురతతో పికేను టచ్ లోకి తెచ్చినట్లు వినికిడి. పైగా గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి బాటలు వేసినవాడు కావడంతో ఆ పార్టీ బలాలు బలహీనతలు పికే పసిగట్టే అవకాశం ఉంది. అందుకే ఎలాగైనా ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు టాక్. ఇప్పటికే నారా లోకేశ్ పీకే తో చర్చలు కూడా జరిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పీకే ఎంట్రీ ఇస్తే ఆయన రాకతో టీడీపీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.
Also Read:హ్యాపీ బర్త్ డే…వెంకటేష్