నిబంధనల ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు..

211
CEO Rajat Kumar
- Advertisement -

ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈవో) రజత్‌ కుమార్ స్పష్టం చేశారు. నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎన్నికల నియమావళిపై ఎన్నికల కమిషన్ స్పష్టత నిచ్చిందని రజత్ కుమార్ పేర్కొన్నారు.

CEO Rajat Kumar

హైదరాబాద్‌లోని సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఎన్నికల నియమావళిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. నిబంధనల ఉల్లంఘన కిందకు వచ్చే అంశాలేంటో ఈసీ స్పష్టం చేసింది. ప్రభుత్వ స్థలాల్లో ప్రకటనలు ఉండకూడదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అన్ని పోస్టర్లు, కటౌట్లు తొలగించాలి. 24 గంటల్లో రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్లు, విమానాశ్రయాల్లో పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలి.

ఇంటి యజమాని అనుమతితోనే బ్యానర్లు కట్టాలి, గోడపత్రికలు అతికించాలి. అనుమతి లేకుంటే 72 గంటల్లో వాటిని తొలగించాలి. ఎన్నికల పనుల కోసం నేతలు ప్రభుత్వ వాహనాలు ఉపయోగించరాదు. ప్రతి జిల్లాలో, సీఈఓ కార్యాలయంలో 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. డిసెంబర్ 7న 119 స్థానాలకు ఒకే సారి పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 11న కౌంటింగ్ ఉంటుందని పేర్కొన్నారు. ఫిర్యాదులన్నింటిని ఎన్నికల సంఘానికి నివేదిస్తాం. కొనసాగుతున్న పనుల వివరాలు 72 గంటల్లో కలెక్టర్లు ఎన్నికల సంఘానికి తెలపాలని, కొత్త పనులు ప్రారంభించరాదని ఆదేశించారు. ఎవరైనా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలనుకుంటే 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు.

- Advertisement -