కండోమ్ యాడ్ లకు కాస్త ఊరట లభించింది. అశ్లీలతను ప్రేరేపించేలా ఉన్నందున కండోమ్ యాడ్లపై కేంద్ర సమాచార & ప్రసార శాఖ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే దానికి సడలింపు ఇస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ఉదయం 6 గం.ల నుంచి రాత్రి 10 గం.ల మధ్య కండోమ్ ప్రకటనలను ప్రసారం చేయకూడదన్న కేంద్రం ఆంక్షలపై సమాచార ప్రసారాల శాఖ స్వల్ప మార్పులు చేసింది. అశ్లీలత రహిత, మహిళలను కించపరిచే విధంగా లేని యాడ్లను ఏ సమయంలోనైనా ప్రదర్శించుకోవచ్చంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.
పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయన్న నెపంతో డిసెంబర్ 11వ తేదీన సమాచార ప్రసారాల శాఖ కండోమ్ ప్రకటనల ప్రసారంపై నిబంధనలు విధించింది. ఈ ఆదేశాలను ప్రశ్నిస్తూ రాజస్థాన్ హైకోర్టు వివరణ కోరింది. ఆ వివరణలో భాగంగా అశ్లీల సన్నివేశాలు, మహిళలను కించపరిచేలా ఉన్న సన్నివేశాలు లేని కండోమ్ ప్రకటనలకు మినహాయింపు కల్పించినట్లు పేర్కొంది.

