నిబంధనల ఉల్లంఘన, అడిగిన డేటాను వెల్లడించడానికి నిరాకరించడం మరియు పదేపదే లేవనెత్తిన సమస్యలను పట్టించుకోకపోవడం వంటి కారణాలను చూపుతూ టెలిగ్రామ్‌పై విధించిన తాత్కాలిక నిషేధంపై ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది కేంద్రం.
గత కొన్ని వారాలుగా పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ చర్చలు జరుపుతున్నప్పటికీ.. మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’ ప్రభుత్వం లేవనెత్తిన పలు అభ్యంతరాలను పరిష్కరించడంలో విఫలమైందని కేంద్రం గురువారం ఢిల్లీ హైకోర్టుకు తెలపనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
జూన్ 21న జరగనున్న నీట్-యూజీ (NEET-UG) 2026 రీ-ఎగ్జామినేషన్‌కు ముందు భారతదేశంలో టెలిగ్రామ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రస్తుతం న్యాయపోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మరింత కఠినం చేసింది.
నిఘా నీడలో ఉన్న కొన్ని టెలిగ్రామ్ ఛానెళ్లకు సంబంధించిన డేటాను మరియు సమాచార వనరులను పంచుకోవడానికి టెలిగ్రామ్ నిరాకరించడం కేంద్రం ప్రధాన అభ్యంతరాల్లో ఒకటి.టెలిగ్రామ్‌కు సంబంధించి తమకున్న ఆందోళనలను ప్లాట్‌ఫామ్‌కు పదేపదే తెలియజేసినప్పటికీ, వారి నుంచి ఎలాంటి సంతృప్తికరమైన స్పందన రాలేదనే విషయాన్ని కేంద్రం కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. పదేపదే అప్రమత్తం చేసినప్పటికీ ఆ యాజమాన్యం ఈ సమస్యలను తగిన విధంగా పరిష్కరించలేదని ప్రభుత్వం వాదించనుంది.
కేంద్రం జారీ చేసిన తాత్కాలిక బ్లాకింగ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ టెలిగ్రామ్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.బుధవారం జరిగిన విచారణలో, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తీసుకున్న చర్యను సమర్థించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69A కింద ఈ బ్లాకింగ్ ఉత్తర్వులు జారీ చేశామని ఆయన కోర్టుకు తెలియజేశారు.
ఇది రాత్రికి రాత్రే జరిగిన పరిణామం కాదు. మే నెల నుంచి మేము వారితో చర్చిస్తున్నాము. మే నెల నుంచే మాకు ఫిర్యాదులు అందుతున్నాయి అని ఆయన కోర్టుకు వివరించారు. ప్లాట్‌ఫామ్ దుర్వినియోగం అవుతోందని నిరూపించేందుకు తమ వద్ద విస్తృతమైన ఆధారాలు ఉన్నాయని మెహతా స్పష్టం చేశారు. ఆ సాక్ష్యాలు చాలా “షాకింగ్” గా ఉన్నాయని ఆయన పదేపదే అభివర్ణించారు.
పరీక్షలకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపణలు ఉన్న కొన్ని ఛానెళ్లను బ్లాక్ చేసినప్పటికీ, అవి మళ్లీ మళ్లీ పుట్టుకొస్తున్నాయని కోర్టుకు సమర్పించిన ఆధారాల్లో పేర్కొన్నారు. అత్యవసర అధికారాలను ఉపయోగించి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి కేంద్రం తగిన వాస్తవాలు మరియు గణాంకాలను రికార్డుల్లో ఉంచుతుందని ఆయన చెప్పారు.
ప్రభుత్వం తీసుకున్న చర్య ఏకపక్షంగా మరియు అసమానంగా ఉందని టెలిగ్రామ్ వాదించింది. తాము అధికారులకు సహకరించామని…ప్రభుత్వ అధికారులతో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నామని, బ్లాక్ చేయడానికి నిర్దిష్ట ఛానెళ్లను సూచించిన ప్రతిసారీ చర్యలు తీసుకున్నామని ఆ సంస్థ సమర్థించుకుంది. ప్రభుత్వం తన స్పందనను మరియు ఆధారాలను రికార్డు చేసిన తర్వాత ఈ వ్యవహారంపై తదుపరి విచారణ జరగనుంది.

