టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు పౌరసత్వం కేసులో చుక్కెదురైంది. చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. తన పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ హోం శాఖలో రమేష్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదంటూ గతంలోనే హైకోర్టు తీర్పును వెల్లడించింది.
చెన్నమనని రమేష్ 2014లో వేములవాడ నుంచి టీఆర్‌ఎస్ తరపున గెలిచారు. చెన్నమనేని రమేశ్ కు జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నందున ఆయన ఎన్నిక చెల్లదంటూ నాడు బీజేపీలో ఉన్న ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు రమేశ్ ఎన్నిక చెల్లదని, ఆయన భారత పౌరుడు కాదని 2013లో తీర్పు ప్రకటించింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ, చెన్నమనేని రమేశ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై తాత్కాలికంగా స్టే విధించిన సుప్రీం…రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకోవాలని రమేష్‌కు సూచించింది. ఈ నేపథ్యంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన రమేష్‌కు మరోసారి చుక్కెదురైంది.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు,దివంగత మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు కుమారుడు చెన్నమనేని రమేష్. ఆయన రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రమేష్…తొలుత టీడీపీలో తర్వాత టీఆర్ఎస్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు స్వయాన బాబాయ్ అవుతారు.