2021 ఏడాదికి సంబంధించి పద్మ అవార్డుల గ్రహీతలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో అట్టహాసంగా ప్రదానోత్సవం జరిగింది. ఏడుగురికి పద్మవిభూషణ్ అవార్డులు, 10 మందికి పద్మభూషణ్ అవార్డులు, 102 మందికి పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.
పద్మవిభూషణ్ అవార్డు దక్కిన వారిలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (తమిళనాడు) ఉన్నారు. ఆయనతో పాటు జపాన్ దేశానికి చెందిన శ్రీ షింజో అబే (పబ్లిక్ అఫైర్స్), కర్ణాటకకు చెందిన బెల్లె మోనప్ప హెడ్గే (మెడిసన్), అమెరికాకు చెందిన నరీందర్ సింగ్ కపాని (సైన్స్ అండ్ ఇంజినీరింగ్), ఢిల్లీకి చెందిన మౌలానా వహిద్దీన్ ఖాన్ (స్ప్రిట్యులిజమ్), ఢిల్లీకి చెందిన బీబీ లాల్ (ఆర్కియాలజీ), ఒడిశాకు చెందిన శ్రీసుదర్శన్ సాహూ (ఆర్ట్) ఉన్నారు.