సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు కేంద్ర ప్రభుత్వానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ట్వీట్ చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొన్న రైతు బంధు, నేడు మిషన్ భగీరథ.. తెలంగాణ ఆదర్శంగా కేంద్ర పథకాలను ప్రవేశపెడుతున్నారని.. దేశానికే కేసీఆర్ దిక్సూచి అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థిక సర్వేలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను మెచ్చుకున్నట్లు తెలిపారు కేటీఆర్. యూఎస్, యూకేలో అవలంభించే విధానాలనే తెలంగాణలో అవలంభించి సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించారని కేంద్ర ఆర్థిక సర్వే నిపుణులు పేర్కొన్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణలో చేపట్టినటువంటి సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టాలని కేంద్ర ఆర్థిక సర్వే నిపుణులు సూచించారని తెలిపారు.
ఇక జీఎస్‌డీపీలోనూ తెలంగాణ దేశంలోనే నెంబర్‌గా నిలిచిందన్నారు కేటీఆర్. 5 ఏళ్లలోనే జీఎస్‌డీపీలో 14.9 శాతం వృద్ధి శాతం సాధించిందని ఇది కేవలం సీఎం కేసీఆర్ సారథ్యంలోనే సాధ్యమయిందన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో హర్ ఘర్ జల్ యోజన అనే పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేయనున్నట్లు తెలిపారు. ఇది తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ పథకాన్ని ఆదర్శంగా తీసుకున్నదే. తెలంగాణ రైతు బంధును కేంద్ర ప్రభుత్వం పీఎమ్ కిసాన్ పేరుతో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కేంద్రం…తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తుందని ట్వీట్ చేశారు.