దేశంలో మంకీపాక్స్ కేసుల పర్యవేక్షణ, కట్టడి కోసం ప్రభుత్వానికి దిశానిర్ధేశం చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక టాస్క్ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ ఈ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఆరోగ్య శాఖ అధికారులతో పాటు దేశంలోని ప్రధాన వైద్య పరిశోధనా సంస్థల ప్రతినిధులూ సభ్యులుగా ఉంటారని తెలిపాయి. వైరస్ నిర్ధారణ, చికిత్సలకు సంబంధించి వసతుల విస్తరణ అవసరమైన ఏర్పాట్లు వ్యాక్సిన్ తయారీ తదితర అంశాలపై ఈ టాస్క్‌ఫోర్స్ సూచనలు చేస్తుంది. ఇటీవల నిర్వహించిన ఓ ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్రీకృత టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.
దేశంలో మంకీపాక్స్ కేసుల నిర్వహణలో ఈ టాస్క్‌ఫోర్స్ సహాయపడుతుంది. ఆయా రాష్ట్రాల్లో నమోదయ్యే కేసులను సమన్వయం చేస్తుంది. అవసరమైతే సూచనలు జారీ చేస్తుంది అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా భారత్‌లో ఇప్పటి వరకు నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మూడు కేరళలో కాగా…. మరొకటి దిల్లీలో వెలుగుచూసింది. ఈ క్రమంలోనే కేరళలో మంకీపాక్స్ లక్షణాలతో ఓ 22ఏళ్ల యువకుడు మృతి చెందాడు. అతని నమూనాలను పరీక్షలకు పంపగా…. మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి సోమవారం వెల్లడించారు. అయితే భారత్‌కు వచ్చే ముందే యూఏఈ లో అతనికి మంకీపాక్స్ పాజిటివ్‌గా తేలగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని వైద్యుల వద్ద దాచిపెట్టినట్లు అతని సన్నిహిత వర్గాలు పెర్కొంటున్నాయి.