వంట నూనె ధరలు.. కేంద్రం కీలక ఆదేశాలు..!

93
oil
- Advertisement -

వంట నూనెలు తయారు చేసే కంపెనీలకు కేంద్ర కీలక ఆదేశాలు జారీ చేసింది. నూనెను ప్యాక్‌ చేసేటప్పుడు వంట నూనె పరిమాణం, ద్రవ్యరాశినే ముద్రించాలని సూచించింది. ఆయా ఉష్ణోగ్రతల వద్ద అనే వివరాలను ఇకపై ముద్రించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఉష్ణోగ్రతల పేరిట కంపెనీలు అక్రమాలకు పాల్పుడుతున్నాయన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయిల్‌ తయారీ కంపెనీలకు, ప్యాకర్స్‌, దిగుమతిదారులకు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 15 వరకు ఆయా కంపెనీలకు గడువు ఇచ్చింది. అప్పట్లోగా లేబులింగ్‌ విధానంలో మార్పులు చేసుకోవాలని సూచించింది.

లీగల్‌ మెట్రాలజీ నిబంధనలు 2011 ప్రకారం వస్తువులు తయారు చేసే కంపెనీలు వస్తువుల నికర పరిమాణం, బరువును తప్పనిసరిగా పేర్కొనాలి. వంట నూనె, వనస్పతి, నెయ్యి వంటి వాటి విషయాల్లో పరిమాణం పేర్కొంటే దాంతో పాటే ఆ వస్తువు బరువు కూడా వెల్లడించాలి. పరిమాణాన్ని వెల్లడించే విషయంలో ఉష్ణోగ్రతల వివరాలు ఎక్కువగా పేర్కొన్నాడాన్ని తాము గుర్తించామని కేంద్రం తెలిపింది. కొన్ని కంపెనీలు ప్యాకింగ్‌ సమయంలో 60 డిగ్రీలుగా ఉన్నట్లు పేర్కొంటున్నాయని తెలిపింది. దీంతో వినియోగదారులు మోసాలకు గురౌతున్నట్లు కేంద్రం గుర్తించి తాజా ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -