దండుపాళ్యం-4 విడుదలకు ముస్తాబవుతోంది. దండుపాళ్యం సిరీస్ లో తొలి చిత్రాల విజయాలు దండుపాళ్యం-4 పై ఇటు ప్రేక్షక వర్గాలలోనూ, అటు వ్యాపార వర్గాలలోనూ ఆసక్తిని మరింత పెంచేలా చేశాయి. సుమ రంగనాధన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా వెంకట్ మూవీస్ పతాకంపై కె.టి.నాయక్ దర్శకత్వంలో నిర్మాత వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవెల షూటింగ్ పూర్తిచేసుకోగా చిత్రయూనిట్‌కి సెన్సార్ బోర్డు షాకిచ్చింది. సినిమా చూసిన తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు బోర్డు సభ్యులు నిరాకరించినట్లు సమాచారం. సినిమా అత్యంత జుగుప్సాకరంగా, అభ్యంతరకరంగా ఉందని, ఈ సినిమాను ప్రజలు చూసేందుకు తాము అంగీకరించబోమని బోర్డు సభ్యులు తెలిపారు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ హింస,లైంగికసంబంధమైన సన్నివేశాలు ఉండటంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.
అయితే,సెన్సార్ బోర్డు నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు నిర్మాత వెంకటేశ్. కోట్లు ఖర్చు పెట్టి తాము సినిమాను నిర్మిస్తే, రీషూట్ చేయాలనో లేదా కొన్ని సన్నివేశాలను తొలగించాలనో చెప్పకుండా ఇలా తిరస్కరించడం ఏంటని మండిపడ్డారు.దీనిపై కోర్టుకు వెళ్తామని చెప్పారు.
ఈ చిత్రానికి ‘దండుపాళ్యం’ మొదటి,రెండు,మూడు చిత్రాలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ ‘దండుపాళ్యం-4’లో జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ ‘దండుపాళ్యం 4’ తెరకెక్కింది. కన్నడ, తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.