30ఏళ్లు పూర్తి చేసుకున్న ‘ఆదిత్య 369’..

28

నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్‌ మూవీ ‘ఆదిత్య 369’. ఈ సినిమా విడుదలై జులై 18వ తేదీకి 30ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదిత్య 369 మూవీపై స్పెషల్ స్టోరీ… ఆదిత్య 1991 జూలై 18న విడుదలైంది. టైమ్ మిషన్ నేపథ్యంలో అప్పటి వరకు భారతీయ సిల్వర్ స్క్రీన్ పై రానటువంటి కథతో వచ్చిన ఈ సినిమా క్లాస్ నుండి మాస్ వరకు అందిరినీ మెప్పించింది. హాలీవుడ్‌లో వచ్చిన ‘‘బ్యాక్ టూ ఫ్యూచర్’’ అనే మూవీ కాన్సెప్ట్ ను మన నేటివిటికి తగ్గట్టు అత్యద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ సింగీతం. ఒక మనిషి భవిష్యత్తులోకి లేదా గతంలోకి ప్రయాణిస్తే ఎట్ల వుంటదనే కాన్సెప్టే ఆదిత్య 369 స్టోరీ. దర్శకుడిగా… సింగీతం శ్రీనివాసరావు సినీ జైత్రయాత్రలో ఆదిత్య 369 ఒక మజిలీ అని చెప్పొచ్చు. పదహారో శతాబ్థానికి చెందిన శ్రీకృష్ణ దేవరాయల వైభవాన్ని ఆనాటి స్వర్ణయుగాన్ని చాలా అందంగా తెరకెక్కించారు.

ఈ మూవీని ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో విలన్‌గా అమ్రిష్ పురి, సైంటిస్ట్‌గా టినూ ఆనంద్ వాళ్ల పరిధి మేరకు అద్భుతంగా నటించి అదరగొట్టారు. ఇక బాలనటుడిగా తరుణ్ కూడా కేకపెట్టించారు. హీరోయిన్‌గా నటించిన మోహిని తన పాత్ర మేరకు పర్వాలేదనిపించారు. ఇక సంగీత పరంగా ఆదిత్య 369 అద్భుతమైన విజయాన్నే నమోదు చేసింది. వేటూరి అద్భుతమైన సాహిత్యానికి స్వరరాజా ఇళయరాజా ఇచ్చిన సంగీతం ఇప్పటికి ఆడియన్స్‌ను అలరిస్తోంది. సింగీతం డైరెక్ట్ జేసిన ఈమూవీకి హాస్యబ్రహ్మా జంధ్యాల కథ, మాటలు అందించారు. ఈ మూవీకి కబీర్ లాల్, పీసీ శ్రీరామ్, వియస్.ఆర్.స్వామి లాంటి ఫేమస్ సినిమాటోగ్రాఫర్స్ పని చేశారు. ముప్పై ఏళ్ల కింద వచ్చిన ఈ క్లాసిక్ మూవీకి ఇపుడు సీక్వెల్ తీయనికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ఈ సీక్వెల్ కు సంబంధించిన కథను సింగీతం ఎపుడో రెడీ చేశాడట. అన్ని కుదిరితే బాలయ్య కమిటైన సినిమాలు పూర్తైయిన తర్వాత ఈ సీక్వెల్ ను పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు బాలయ్య స్వయంగా దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. మోక్షజ్ణ హీరోగా చేస్తారని వినిపిస్తోంది.

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఆదిత్య 369 విడుదలై 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రేక్షక మహాశయులకు ధన్యవాదాలు. ఎన్నిసార్లు చూసినా అదొక అద్భుతం. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎప్పుడు ప్రసారమైనా ఆ సినిమాను చూస్తూనే ఉంటారు. చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. కానీ, ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన కొన్ని చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఈ సినిమా కార్యరూపం దాల్చడంలో ప్రధాన పాత్ర అమర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంది. ఇలాంటి సినిమాలు తీయాలంటే దర్శకుడికి ధైర్యం, నిర్మాతకు ప్యాషన్‌ ఉండాలి. హీరోకు రెండూ ఉండాలి. ఈ సినిమాకు గుండెకాయ శ్రీకృష్ణదేవరాయలు పాత్ర. ప్రతి విషయంలోనూ ఆచితూచి సినిమాను తెరకెక్కించారు. ఇలాంటి సినిమా చేయడం నా పూర్వ జన్మ సుకృతం. ఇక ముందు ఈ చిత్రానికి సీక్వెల్‌ చేయాలన్న నిర్ణయానికి వచ్చాం’’ అని అన్నారు.

30 Years of Aditya 369 Movie | Nandamuri Balakrishna | Mohini | Singeetam SrinivasaRao | Ilayaraja