సాధారణ నొప్పి నివారణ మందులు , యాంటీబయోటిక్స్‌ను విచక్షణారహితంగా ఉపయోగించడం వల్ల మూత్రపిండాల (కిడ్నీ) సమస్యలు, దుష్ప్రభావాలు మరియు యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ తలెత్తుతాయని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఒక సలహా పత్రాన్ని జారీ చేసింది. సొంత వైద్యం (Self-medication) చేసుకోవడంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పరిధిలోని CDSCO సెప్టెంబర్ 21, 2026 నాటి ఈ సర్క్యులర్‌ను ఆరోగ్య నిపుణులు, ఫార్మసిస్ట్‌లు, రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఆసుపత్రులు మరియు సాధారణ ప్రజల హెచ్చరిక కోసం విడుదల చేసింది.
వైద్యుల సలహా లేకుండా వాడొద్దు:
డాక్టర్ల సలహా లేకుండా నొప్పి నివారణ మందులు (NSAIDs), యాంటీబయోటిక్స్‌ను నిరంతరంగా, సుదీర్ఘకాలం పాటు విచక్షణారహితంగా వాడకూడదని సూచించింది.
వైద్య నిపుణుల (Registered Medical Practitioner) పర్యవేక్షణలో, అవసరమైన సమయం వరకు మాత్రమే వీటిని వినియోగించాలి.
ఇప్పటికే కిడ్నీ సమస్యలు లేదా సంబంధిత ప్రమాదకర ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు ఎన్‌ఎస్‌ఏఐడీ (NSAID) ఔషధాలను వాడే ముందు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.
నొప్పి, జ్వరం లేదా ఇతర లక్షణాలు మళ్లీ మళ్లీ వస్తుంటే, సొంతంగా టాబ్లెట్లు మింగకుండా వైద్య సంప్రదింపులు జరపాలి.
సొంతంగా యాంటీబయోటిక్స్ వాడకం వద్దు:
సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లు (జలుబు, సాధారణ జ్వరం) వంటి వాటికి యాంటీబయోటిక్స్ అవసరం లేదు. అలాంటి సమయాల్లో సొంత వైద్యం అసలే కూడదు.
డాక్టర్ సూచించిన యాంటీబయోటిక్స్‌ను ఇచ్చిన వ్యవధి ప్రకారం మాత్రమే వాడాలి, వాటిని ఇతరులతో పంచుకోకూడదు.
వైద్యులు కూడా మందులను సూచించేటప్పుడు జాగ్రత్తలు వహించాలని, అనవసరమైన కాంబినేషన్ మందులు, తప్పుడు డోసేజ్‌లు సూచించవద్దని పేర్కొంది.
ఫార్మసిస్ట్‌లు, మెడికల్ షాపులకు ఆదేశాలు:
‘షెడ్యూల్ హెచ్’ (Schedule H), ‘షెడ్యూల్ హెచ్1’ (Schedule H1) పరిధిలోకి వచ్చే ప్రిస్క్రిప్షన్ మందులను డాక్టర్ల చీటీ (Prescription) లేకుండా అమ్మకూడదు.
Also Read:గణేశుడి లడ్డూ@రూ. కోటి
రోగులను సొంత వైద్యం వైపు ప్రోత్సహించకూడదు. మందుల లేబుల్స్‌పై ఉన్న హెచ్చరికలను ఖచ్చితంగా పాటించాలి.
ఆసుపత్రులు, అధికారుల పాత్ర:
ఆసుపత్రులు మరియు ఆరోగ్య సంస్థలు మందుల ప్రిస్క్రిప్షన్ల సమీక్ష, రోగులకు కౌన్సెలింగ్ విధానాలను బలోపేతం చేయాలని హెచ్చరించారు. అలాగే రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ఔషధ నియంత్రణ అధికారులు ఈ ముప్పుపై ప్రజల్లో, వైద్య వర్గాల్లో అవగాహన పెంచాలని CDSCO స్పష్టం చేసింది.
నొప్పి నివారణ మందులు, యాంటీబయోటిక్స్ వాడకంలో బాధ్యతాయుతమైన వైఖరిని అవలంబించి కిడ్నీ వైఫల్యాలు, ఇతర అనర్థాల నుండి కాపాడుకోవాలని అధికారుల ముగింపు ప్రకటనలో పేర్కొన్నారు.

