మంత్రి ఎర్రబెల్లిని కలిసిన సీసీఐ అధికారులు..

114
Minister Errabelli

ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 9 లక్షల హెక్టార్లలో ప్రత్తి సాగు చేయబడుతున్నదని, అందువల్ల కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు రైతులు పండించిన ప్రత్తికి అధిక ధర వచ్చే విధంగా చూడాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులను రాష్ట్ర పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి,గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. హన్మకొండలోని రోడ్లు,భవనాల శాఖ అతిధి గృహంలో బుధవారం నాడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ అమరనాథ్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు మంత్రిని కలిసారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ప్రత్తి క్వింటాల్‌కు కనీస మద్దతు ధర 6025 రూపాయలుగా నిర్ణయించిందని, నిర్ణయించిన మద్దతు ధర కన్నా ఎక్కువ ధరకు రైతుల నుండి ప్రత్తి కొనుగోలు చేసే విధంగా చూడాలని అయన అధికారులను కోరారు. రైతే రాష్టానికి వెన్నుముక అని, రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టి అమలు చేస్తున్నదని మంత్రి అన్నారు.

వరంగల్‌లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయ వసతి కోసం రాష్ట్ర ప్రభుత్వం భవనాన్ని కేటాయిస్తామని ఈ సందర్బంగా సీసీఐ అధికారులకు మంత్రి హామీ ఇచ్చారు. సీసీఐ వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ బ్రాంచీల ద్వారా గత ఆర్ధిక సంవత్సరంలో 29 జిల్లాలలోని 112 కేంద్రాల ద్వారా 7 లక్షల 99 వేల 340 రైతుల నుండి 1 కోటి 78 లక్షల 90 వేల 264 క్వింటాళ్ల ప్రత్తిని సేకరించి 10167 కోట్ల 71 లక్షల 2 వేల 394 రూపాయలను చెల్లించడం జరిగిందని సీసీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ అమరనాథ్ రెడ్డి ఈ సందర్బంగా తెలిపారు. సీసీఐ కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వ భవనాన్ని కేటాయించనందుకు సీసీఐ అధికారులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.