దశాబ్దాలుగా గొడవలు జరుగుతున్న కావేరి నదీ జలాల వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. నది జలాలు జాతీయ సంపద అని తెలిపిన సుప్రీం…ఇప్పటివరకు 190 టీఎంసీలు వాడుకుంటున్న తమిళనాడుకు 177 టీఎంసీలను కేటాయించాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
బెంగళూరు తాగు నీటి అవసరాలకు 4.2 టీఎంసీలను కేటాయించింది. కావేరి నది ఏ ఒక్క రాష్ట్రానికి సంబంధించినది కాదని తెలిపింది. కర్ణాటక 14.75 టీఎంసీలు అదనంగా వాడుకోవాలని చెప్పింది.సుప్రీం తీర్పుపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పుతో కర్ణాటకకు 184.75 టీఎంసీల నీటివాటా దక్కింది. సుప్రీం తీర్పుతో తమ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అన్నాడీఎంకే నేతలు తెలిపారు. న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారని కానీ కర్ణాటక రాష్ట్రానికే న్యాయం జరిగేలా తీర్పు వెలువడిందని ఆ పార్టీ నేత మైత్రేయన్ తెలిపారు.
2007లో కావేరి నది జలాల విషయంలో ఏర్పాటుచేసిన బోర్డు 419 టీఎంసీలు తమిళనాడు,270 టీఎంసీలు కర్ణాటక,30 టీఎంసీలు కేరళ,7 టీఎంసీలు పుదుచ్చేరి వాడుకోవాలని ఆదేశాలివ్వగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.కావేరీ నదీ జలాల తీర్పు నేపథ్యంలో కర్ణాటక,తమిళనాడులో భారీ భద్రత ఏర్పాట్లను చేశారు. తీర్పు తరువాత తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలోని కన్నడిగుల ఆస్తులపై దాడులు జరగవచ్చని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చెన్నైలోని కర్ణాటక విద్యాసంస్థలు, కర్ణాటక బ్యాంకు శాఖలు, ఉడిపి హోటల్స్, భారీగా పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.