ప్రముఖ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై సరూర్‌నగర్ పోలీసుస్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని ఆలపించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పవన్ కళ్యాణ్ అవమానించారంటూ హైకోర్టు న్యాయవాది జనార్ధన్ గౌడ్ పవన్‌పై కేసు పెట్టారు. సుప్రీం కోర్టు తీర్పును తన ట్విట్టర్ ఖాతాలో పవన్ అవమానించినట్లు చెప్పారు. దేశ ప్రజల్లో జాతీయగీత వ్యతిరేక ప్రచారం చేస్తూ రెచ్చగొడుతున్నారని, దేశ వ్యతిరేక చర్యలకు పవన్ పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు.
గత రెండు మూడు రోజుల నుంచి ట్వీట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ బీజేపీని తీవ్రస్తాయిలో విమర్శస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా ఐదు అంశాలను ఎంచుకుని..వాటిపై తనదైన రీతిలో స్పందిస్తున్నాడు. మొదటగా గోవధ నిషేదంపై బీజేపీ కి సవాల్ విసిరిన పవన్ ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల మృతిపై స్పందించాడు. బీజేపీ వేధింపులే రోహిత్ ఆత్మహత్యకు కారణమని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే వారిని వేధింపులకు గురి చేస్తారని ప్రశ్నించారు.
మూడవ అంశంగా శనివారం దేశభక్తి గురించి ప్రస్తావించారు పవన్. కుల, మత, వర్గ, ప్రాంత, భాషా విభేదాలు లేకుండా దేశంలోని పౌరుడు, రాజకీయ పార్టీలు ముందుకు వెళ్లడమే దేశభక్తి అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అందులో భాగంగానే సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని ఆలపించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై స్పందించారు. రాజకీయ పార్టీలు తమ పార్టీ మీటింగ్‌లను జాతీయగీతంతో ఎందుకు ప్రారంభించబోవని, సినిమా థియేటర్‌లలో మాత్రమే పాడాలని ఎందుకు చెబుతున్నారని పవన్ ప్రశ్నించారు. ఇదే విషయంపై పవన్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సుప్రీం ఇచ్చిన తీర్పును పవన్ అవమానించారంటూ పవన్ పై కేసు పెట్టారు.