గుండె ఆగిపోవడం (కార్డియాక్ అరెస్ట్) గురించి ఆలోచించినప్పుడు, మనం ఎక్కువగా గుండె గురించే ఆందోళన చెందుతాం. కానీ గుండె అకస్మాత్తుగా రక్తాన్ని పంప్ చేయడం ఆపివేసినప్పుడు, వెంటనే ప్రమాదంలో పడేది మెదడు.సరైన రక్తప్రసరణ లేకపోతే, మెదడు పనిచేయడానికి అవసరమైన ప్రాణవాయువు (ఆక్సిజన్) అందదు. అందుకే కార్డియాక్ అరెస్ట్ అనేది కేవలం గుండెకు సంబంధించిన అత్యవసర పరిస్థితి మాత్రమే కాదు, మెదడుకు సంబంధించిన తీవ్రమైన అత్యవసర పరిస్థితి కూడా. కార్డియాక్ అరెస్ట్ మెదడుపై ఎలా ప్రభావం చూపుతుంది, తక్షణ సహాయం అందించడం ఎందుకు అత్యంత కీలకమో ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్, స్ట్రక్చరల్ హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అంకుర్ ఫర్తార్పేకర్ వివరించారు.
గుండె స్పందించడం ఆగిపోయిన మరుక్షణమే, మెదడుకు వెళ్లే రక్త సరఫరా నిలిచిపోతుంది. కొద్ది సెకన్లలోనే మెదడుకు ఆక్సిజన్ అందక, వ్యక్తి స్పృహ కోల్పోతాడు. ఆక్సిజన్ అందకపోవడం ఇలాగే కొనసాగితే, మెదడు కణాలు దెబ్బతినడం ప్రారంభమవుతుంది. మెదడుకు రక్తప్రసరణ లేని సమయం పెరిగే కొద్దీ, మెదడు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది.
డాక్టర్ ఫర్తార్పేకర్ ప్రకారం, హార్ట్ ఎటాక్ మరియు కార్డియాక్ అరెస్ట్ ల వల్ల మెదడుపై పడే ప్రభావంలో వ్యత్యాసం ఉంటుంది. గుండెకు రక్తప్రసరణ తగ్గుతుంది, కానీ గుండె పనిచేస్తూనే ఉండటం వల్ల మెదడుకు ఆక్సిజన్‌తో కూడిన రక్తం అందుతూనే ఉంటుంది. (తీవ్రమైన హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు మాత్రమే రక్తప్రసరణ తగ్గడం వల్ల మెదడు దెబ్బతినే అవకాశం ఉంది). ఇందులో గుండె అకస్మాత్తుగా పంపింగ్ ఆపేయడం వల్ల మెదడుకు రక్తప్రసరణ తక్షణమే ఆగిపోతుంది.
మెదడుకు ఆక్సిజన్ మరియు రక్తప్రసరణ అందకుండా ఎంత సమయం గడిస్తే, మెదడు శాశ్వతంగా దెబ్బతినే అవకాశం అంతగా పెరుగుతుంది. అందుకే వెంటనే స్పందించడం అత్యంత ముఖ్యం.అందుకే లక్షణాలను ముందే గుర్తించడం, వెంటనే అత్యవసర వైద్య సహాయానికి కాల్ చేయడం, సిపిఆర్ (CPR) ప్రారంభించడం మరియు దగ్గరలో ఉంటే ఏఈడీ (AED – ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డిఫిబ్రిలేటర్) వాడటం చాలా ముఖ్యం. ఇవి కేవలం ప్రాణాలను రక్షించడమే కాకుండా, మెదడు దెబ్బతినకుండా కాపాడతాయి అని నిపుణులు తెలిపారు.
వైద్య సహాయం అందే వరకు మెదడుకు మరియు ఇతర ముఖ్య అవయవాలకు కొంతవరకు రక్తప్రసరణ జరిగేలా సీపీఆర్ ఉపయోగపడుతుంది. అలాగే సరైన సమయంలో ఉపయోగించే ఏఈడీ పరికరం కూడా కార్డియాక్ అరెస్ట్ సమయంలో ప్రాణాలను కాపాడుతుంది. కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటపడినంత మాత్రాన మెదడుపై ఎలాంటి ప్రభావం పడలేదని చెప్పలేం. కొందరు బాధితులు కోలుకున్నాక అయోమయం , జ్ఞాపకశక్తి తగ్గడం, మాటలు లేదా కదలికలలో ఇబ్బందులు, ఫిట్స్ లేదా స్పృహలో మార్పులు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. మెదడుకు ఎంతసేపు ఆక్సిజన్ అందలేదు మరియు ఎంత వేగంగా సాధారణ రక్తప్రసరణ పునరుద్ధరించబడింది అనే అంశాలపై ఈ ప్రభావాల తీవ్రత ఆధారపడి ఉంటుంది.ఇలాంటి అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించడం అంటే కేవలం ఒక గుండెను మళ్లీ కొట్టుకునేలా చేయడం మాత్రమే కాదు, ఒక వ్యక్తి మెదడును కాపాడి, వారు పూర్తిస్థాయిలో కోలుకునేలా చేయడం చాలా ముఖ్యం.
Also Read:అసెంబ్లీ నుండి BRS ఎమ్మెల్యేల సస్పెన్షన్

