స్మిత్ మచ్చార్‌కి ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు

2
- Advertisement -

కాక్‌పిట్‌లో జరిగిన దాడి సమయంలో అద్భుత ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రమాదాన్ని తప్పించినందుకు గాను, ఫ్లైదుబాయ్‌కి చెందిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కి ఇజ్రాయెల్ ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ అందజేయనుంది. కెప్టెన్ మచ్చార్ ప్రస్తుతం అబుదాబిలోని ఒక ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.

తెల్ అవీవ్‌కు వెళ్తున్న విమానాన్ని హైజాక్ చేయడానికి జరిగిన ప్రయత్నంలో అసాధారణ ధైర్యాన్ని కనబరిచినందుకై ఇజ్రాయెల్ ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. తీవ్ర గాయాలై, భారీగా రక్తం కోల్పోయినప్పటికీ, కెప్టెన్ మచ్చార్ కాక్‌పిట్ తలుపును తెరవగలిగారు. దీనివల్ల ప్రయాణికులు లోపలికి వచ్చి దాడి చేసిన వ్యక్తిని లొంగదీసుకోగలిగారు. ఆయన సమయస్ఫూర్తి వల్ల విమానంలో ఉన్న 174 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ప్రాణాలు సురక్షితంగా మిగిలాయి.

కెప్టెన్ మచ్చార్ గాయాల నుండి కోలుకున్న తర్వాత ఈ గౌరవాన్ని అందజేస్తామని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తెలిపారు. అధ్యక్షుడు హెర్జోగ్ పైలట్ యొక్క ధైర్యాన్ని, వృత్తిపరమైన నిబద్ధతను ప్రశంసించారు. ఈ రోజు మనం ఇజ్రాయెల్ వీరులను స్మరించుకుంటూ, వారితో పాటు భారత్‌కు చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. ఆయన చూపిన అసాధారణ ధైర్యం ఒక పెద్ద ప్రమాదాన్ని నివారించింది. ఆయన కోలుకున్నాక, ఇజ్రాయెల్ ప్రజల తరఫున ఈ అవార్డును అందజేయడం నాకు లభించే గౌరవంగా భావిస్తున్నాను అని తెలిపారు.

కాక్‌పిట్ లోపల ఉన్న ఒమాన్‌కు చెందిన కో-పైలట్ హమ్మామి అల్-హమ్మామి, విమానంలో ఉండే crash axe తో కెప్టెన్ మచ్చార్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మచ్చార్, అపారమైన రక్తం కారుతున్నా సరే కాక్‌పిట్ తలుపును తెరిచారు. దీంతో ప్రయాణికులు లోపలికి వచ్చి కో-పైలట్‌ను పట్టుకోగలిగారు. కెప్టెన్ ప్రతిఘటన, ఆపై ప్రయాణికులు మరియు ఇతర పైలట్ల సమయస్ఫూర్తి వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పింది.

Also Read;జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు..కేటీఆర్‌ దిశానిర్దేశం

ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం అల్-హమ్మామి విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకుని, తెల్ అవీవ్‌కు తీసుకెళ్లి ఒక భవనాన్ని ఢీకొట్టాలని ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ విఫలమవ్వడంతో, విమానాన్ని ఎడారిలో కూల్చివేయడానికి ప్రయత్నించాడు. అయితే అదే విమానంలో ప్రయాణిస్తున్న ఆఫ్-డ్యూటీ పైలట్లు వెంటనే స్పందించి విమాన నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారు విమానాన్ని సౌదీ అరేబియాలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

- Advertisement -