కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. సోమశీల ప్రాజెక్టుపై ప్రతిపాదించిన రెండు వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. వాస్తవానికి మూడేళ్ల క్రితమే ప్రారంభం కావాల్సి ఉన్నా అనివార్య కారణాలతో కార్యరూపం దాల్చలేదు.
ఈ నేపథ్యంలో ఒకసారి రద్దయిన ఈ ప్రాజెక్టును ఇటీవల నేషనల్ హైవేస్ ఒరిజినల్ (ఎన్‌హెచ్-ఓ) జాబితాలో చేర్చడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. 800 మీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.1,062 కోట్ల వ్యయాన్ని అంచనా వేస్తున్నారు.
ఈ బ్రిడ్జి పూర్తయితే, కృష్ణా నది ఈవతల తెలంగాణలోని మల్లేశ్వరం, అవతల ఆంధ్రప్రదేశ్‌లోని సంగమేశ్వరం పుణ్యక్షేత్రాలను అనుసంధానం చేస్తుంది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లే దూరం దాదాపు 90 కిలోమీటర్లు తగ్గనుంది.
సోమశిల వద్ద ప్రతిపాదిత ఈ రెండు వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి దేశంలోనే తన తరహాలో మొదటిదిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టులో అత్యంత ప్రత్యేకంగా నిలిచే అంశం – ప్రకృతి అందాలను వీక్షించేందుకు గాజుతో కూడిన నడకదారిని డిజైన్‌లో భాగం చేయడం. ఇప్పటివరకు భారత్‌లో ఇలాంటి గాజు డెక్ అనుసంధానంతో కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి ఎక్కడా లేదు.
Also Read:కాంగ్రెస్‌కు 3..బీఆర్ఎస్‌కి 1, సీపీఐ1

