తెలంగాణకు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రానుంది. చైనా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ సంస్థ బీవైడీ.. హైదరాబాద్ సమీపంలో విద్యుత్తు కార్ల యూనిట్ స్థాపించాలని భావిస్తోంది. కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు సాగిస్తూ.. ఇటీవల తుది నిర్ణయాన్ని తెలియజేసినట్లు సంబంధిత వర్గాల సమాచారం.
హైదరాబాద్ పరిసరాల్లో యూనిట్ ఏర్పాటుకు అనువైన మూడు ప్రదేశాలను బీవైడీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయానికి రాగానే, ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది.
ఇది కార్యరూపం దాల్చితే ఈవీ కార్ల విభాగంలో అతిపెద్ద ప్రైవేటు రంగ ప్రాజెక్టును, భారీ పెట్టుబడిని దక్కించుకున్న ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుంది. బీవైడీ కొన్నేళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ, ఇక్కడ సొంత యూనిట్లు లేవు. ప్రస్తుతం బీవైడీ విద్యుత్తు కార్లను(ఈవీ) చైనా నుంచి మనదేశానికి తీసుకువచ్చి విక్రయిస్తోంది. ఇందుకోసం అధిక దిగుమతి సుంకాలు చెల్లించాల్సి రావడం వల్ల, ప్రస్తుతం ఈ కార్ల ధర ఎక్కువగా ఉంది.
భారత్‌లో సొంత యూనిట్ ఏర్పాటు చేసేందుకు రెండేళ్లుగా బీవైడీ కసరత్తు చేస్తోంది. అది తెలంగాణకు వస్తుండటం విశేషం.
Also Read:మాజీమంత్రి కొడాలి నానికి గుండెపోటు!