పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే,నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బూడిద బిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. త్వరలో తాను టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీని వీడుతూ.. కోమటిరెడ్డి సోదరులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను రెండు సార్లు ఓడిపోవడానికి వాళ్లే కారణమని ఆరోపించారు.
భువనగిరి లోక్ సభ టికెట్ తనకు దక్కుతుందని భావించానని కానీ తన ఓటమికి కారణమైన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కేటాయించారన్నారు. పార్టీలో బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితుడినై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
బిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్‌ను వీడటం ఆ పార్టీతో పాటు కోమటిరెడ్డికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆలేరులో కాంగ్రెస్‌కు గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. దీనికి తోడు గౌడ సామాజికవర్గ ఓట్లు ఎక్కువగా ఉండటంతో బూడిద బిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్‌లో చేరనుండటంతో బూర నర్సయ్య గౌడ్ మెజార్టీ మరింత పెరిగే అవకాశం ఉంది.