ఇది ప్రజాకర్షక బడ్జెట్ ?

339
Budget at 11 AM
- Advertisement -

2018-19 సాధారణ బడ్జెట్‌కు రంగం సిద్ధమైంది. ఉదయం 11 గంటలకు ఐదోసారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు అరుణ్ జైట్లీ. 2019 సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు మరింత ప్రాధాన్యత చేకూరింది. ఎన్నికల దృష్ట్యా వ్యవసాయం, ఉపాధి, మౌళిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో ఎక్కువ మొత్తం కేటాయించే అవకాశం కనిపిస్తోంది.

పట్టణ ప్రాంతాల్లో పట్టున్న బిజెపికి గ్రామీణ ప్రజలను ఆకర్షించడం పెద్ద సవాల్‌గా మారింది. రైతులు, గ్రామీణ ప్రజలను ఆకర్షించేవిధంగా బడ్జెట్‌ ఉంటుందని అంచనా. రైతులకు కొత్త పథకాలు, యువతకు ఉపాధి హామీ, గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలకు ప్రాధాన్యతనిచ్చే విధంగా బడ్జెట్‌ ఉండబోతోందని నిపుణుల అంచనా. వ్యవసాయం, రహదారుల నిర్మాణం, రైల్వేల ఆధునీకీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కల్పించే అవకాశం ఉంది.

జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత అరుణ్ జైట్లీ ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడం ఈ సారి ప్రజాకర్షకంగా బడ్జెట్ ఉండనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికలు ముందస్తుగానే జరగవచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో, బడ్జెట్ లో తాయిలాలు అధికంగానే ఉంటాయని అంచనా.

గత నాలుగేళ్లలో వృద్ధి రేటు గణనీయంగా తగ్గడం, అది కూడా ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాతనే అంటూ విపక్షాలు విమర్శిస్తుండటంతో, వృద్ధి రేటు పెంపు లక్ష్యంగా జైట్లీ పలు కీలక ప్రతిపాదనలను తీసుకు రానున్నారని అధికార వర్గాలు అంటున్నాయి.

జాతీయ రహదారులు, రైల్వేల ఆధునికీకరణ తదితరాల నిమిత్తం గత సంవత్సరం బడ్జెట్ లో 3.96 లక్షల కోట్లను కేటాయించిన జైట్లీ, ఈ సంవత్సరం దాన్ని మరింత పెంచుతారని తెలుస్తోంది. కార్పొరేట్ టాక్స్ ను ప్రస్తుతమున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడం వంటి కొన్ని మార్కెట్ వర్గాలకు అనుకూల నిర్ణయాలు కూడా ఉంటాయని సమాచారం. జిడిపి వృద్ధిరేటును పరుగులు పెట్టించడానికి పెట్టుబడులనే నమ్ముకున్న కేంద్రం ఎఫ్‌డిఐలకు మరింత ఊతమిచ్చే అవకాశం ఉంది.

- Advertisement -